Congress: కాంగ్రెస్ నాయకుడు జైరామ్ రమేష్, ఆపరేషన్ సిందూర్, పహల్గామ్ ఉగ్రదాడులపై ప్రధాని నరేంద్రమోడీని విమర్శించారు. అటల్ బిహారీ వాజ్‌పేయి సమయంలో కార్గిల్ యుద్ధ సమయంలో ఉన్న బీజేపీకి, ఇప్పటి బీజేపీ చాలా మార్పు ఉందని అన్నారు. 1999 కార్గిల్ యుద్ధం తర్వాత నలుగురు సభ్యులతో కార్గిల్ సమీక్ష కమిటిని ఏర్పాటు చేయాలనే వాజ్‌పేయి నిర్ణయాన్ని ఆయన గుర్తు చేశారు. ఆ సమయంలో ప్రధానిగా ఉన్న వాజ్‌పేయికి, ఇప్పుడు ఉన్న ప్రధాని మోడీ వేరు వేరు అని అన్నారు.
‘‘భారత-పాకిస్తాన్ యుద్ధం ముగిసిన మూడు రోజుల తర్వాత, జూలై 30, 1999న, వాజ్‌పేయి ప్రభుత్వం నలుగురు సభ్యులతో కూడిన కార్గిల్ సమీక్ష కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి కె. సుబ్రహ్మణ్యం అధ్యక్షత వహించారు, ఆయన కుమారుడు ఇప్పుడు భారతదేశ విదేశాంగ మంత్రి. కమిటీ డిసెంబర్ 15, 1999న నివేదికను సమర్పించింది. ఫిబ్రవరి 23, 2000న తగిన సవరణలతో పార్లమెంటులో దీనిని ప్రవేశపెట్టారు. దీనిపై కూడా చర్చించారు. కానీ అప్పటి ప్రధాని, పాలక బీజేపీ వేరు’’ అని జైరాం రమేష్ ట్వీట్ చేశారు.
Read Also: Hamas: టర్కీకి పారిపోయి మళ్లీ వివాహం చేసుకున్న “హమాస్” చీఫ్ భార్య..
లోక్‌సభలో సోమవారం జరగనున్న ఆపరేషన్ సిందూర్ పై ప్రత్యేక చర్చ ముందు జైరాం రమేష్ నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి. పహల్గామ్ దాడికి పాల్పడిన ఉగ్రవాదుల్ని ఇంకా చట్టం ముందు నిలబెట్టలేదని ఆయన అన్నారు. గతంలో ఈ ఉగ్రవాదులే పూంచ్ (డిసెంబర్ 2023), గంగాగిర్ మరియు గుల్మార్గ్ (అక్టోబర్ 2024)లలో జరిగిన ఉగ్రవాద దాడుల్లో పాల్గొన్నట్లు సమాచారం ఉందని చెప్పారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత అఖిలపక్ష సమావేశానికి మోడీ అధ్యక్షత వహించకపోవడంపై విమర్శలు గుప్పించారు.
భారతదేశం- పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహించినట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వాదనపై జైరాం రమేష్ మోడీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌ను ట్రంప్ విందుకు ఎలా ఆతిథ్యం ఇచ్చారని ప్రశ్నించారు. ఇప్పటి వరకు ట్రంప్ 26 సార్లు యుద్ధాన్ని ఆపినట్లు ప్రకటించుకున్నాడని, 5 ఫైటర్ జెట్లు కూలినట్లు చెప్పాడని ఆయన అన్నారు.