కాంగ్రెస్ నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీని నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారిస్తోంది. ఈ విచారణపై కాంగ్రెస్ పార్టీ ఫైర్ అవుతోంది. దేశ రాజధానితో పాటు అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ శ్రేణులు నిరసన తెలుపుతున్నాయి. బుధవారం ఢిల్లీలో జరిగిన ఆందోళనల్లో ఢిల్లీ పోలీసులు ఎంపీలపై అనుచితంగా వ్యవహించారని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. ఎంపీలని చూడకుండా లాఠీ ఛార్జ్ చేశారని కాంగ్రెస్ ఎంపీలు ఆరోపిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. తమిళనాడుకు చెందిన ఎంపీ జోతిమణి, ఢిల్లీ పోలీసులపై చేసిన ఆరోపణలు వైరల్ అవుతున్నాయి. తమిళనాడు కరూర్ కు చెందిన కాంగ్రెస్ ఎంపీ జోతిమణి నిరసనలు తెలుపుతున్న సందర్భంలో ఢిల్లీ పోలీసులు దారుణంగా వ్యవహరించారని ఆమె ట్విట్టర్ లో వీడియోను పోస్ట్ చేసింది. తన బట్టలు చిరిగేలా ప్రవర్తించడంతో పాటు కనీసం తాగడానికి నీరు అందించాలని అడిగినా ఒప్పుకోలేదని.. బయట షాపుల నుంచి వాటర్ బాటిల్స్ కొందాం అని అనుకున్నా.. నీరు ఇవ్వొద్దని షాపు యజమానులను ఆదేశించారని, బస్సులో నాతో పాటు 7-8 మంది మహిళా ఎంపీలు ఉన్నారని ఆమె వీడియో తీసి, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని కోరారు.
అయితే ఈ ఘటనపై కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ ట్వీట్ చేశారు. ‘‘ ఏ ప్రజాస్వామ్యంలో అయినా ఇలా చేయడం దారుణం అని.. మహిళా నిరసనకారులతో ఇలా వ్యవహరించడం భారతీయ మర్యాదను ఉల్లంఘించడమే అని.. ఈ విషయంలో ఢిల్లీ పోలీసులు ప్రవర్తనను ఖండిస్తున్నాని, స్పీకర్ ఓం బిర్లా దీనిపై చర్య తీసుకోవాలిని ట్వీట్ చేశారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ నేతలు గురువారం పార్లమెంట్ లో సమావేశం అయ్యారు. ఢిల్లీ పోలీసులు తమపై వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏఐసీసీ కార్యాలయంలోకి పోలీసులు రావడం, లాఠీ ఛార్జ్ చేయడంపై స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేయనున్నారు.
https://twitter.com/ShashiTharoor/status/1537122107028652035