Congress Presidential Election: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల రేసులో చివరకు దిగ్విజయ్ సింగ్, శశథరూర్‌లు ఉన్నారు. ఈ ఇద్దరు నేతలు అక్టోబర్ 17న జరిగే ఎన్నికల్లో పోటీపడనున్నారు. ఎన్నో ఏళ్లుగా గాంధీ కుటుంబానికి విధేయుడిగా ఉన్న దిగ్విజయ్ సింగ్ మొదట ఎన్నికల్లో పోటీ చేసేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదు. నిన్నటి వరకు రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్ పేరు మాత్రమే వినిపించింది. ఉన్నట్టుండి ఆయన అధిష్ఠానంపై తిరుగుబావుటా ఎగరేయటం పరిస్థితుల్ని పూర్తిగా మార్చేసింది. సోనియా గాంధీ…గహ్లోత్ వైఖరిపై చాలా అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది. అందుకే…అధ్యక్ష ఎన్నికల్లో దిగ్విజయ్ సింగ్, శశిథరూర్ మధ్యే పోటీ నెలకొన్నట్లు రాజకీయ వర్గాలు వెల్లడిస్తున్నారు. ఈ ఇరువురు నేతలు రేపు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఢిల్లీలోని సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ నుండి నామినేషన్ పత్రాలను తీసుకున్నారు.
Madhyapradesh Minister: అలా చేస్తే తలక్రిందులుగా వేలాడదీస్తా.. అధికారికి మంత్రి బెదిరింపులు
నామినేషన్ పత్రాలను తీసుకునేందుకే ఢిల్లీకి వచ్చినట్లు దిగ్విజయ్ సింగ్ వెల్లడించారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం రేపు నామినేషన్ వేయనున్నట్లు ఇవాళ ఆయన స్పష్టం చేశారు. అక్టోబర్ 17వ తేదీన కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. 75 ఏళ్ల మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్.. గాంధీ కుటుంబానికి సన్నిహితుడు. కేరళ ఎంపీ శశి థరూర్ కూడా అధ్యక్ష పదవి కోసం పోటీపడనున్న విషయం తెలిసిందే. మరోవైపు అశోక్ గెహ్లాట్ కూడా నామినేషన్ వేస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
అటు మల్లిఖార్జున ఖర్గే, ఏకే ఆంటోనీ కూడా అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు ఆసక్తి కనబర్చుతున్నారు. నిన్న సోనియా గాంధీతో ఏకే ఆంటోని సమావేశమయ్యారు. కాంగ్రెస్ ఎన్నికల బరిలో దిగ్విజయ్ సింగ్, శశిథరూర్ ఇద్దరే ఉంటే.. సోనియా గాంధీ మద్దతు దిగ్విజయ్‌కే ఉండే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడు దిగ్విజయ్ సింగ్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.