Congress President Elections: కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నోటిఫికేషన్ విడుదలైంది. ఇక పోటీలో ఎవరెవరు ఉంటారనేదానిపై సస్పెన్స్ నెలకొంది. ఈ సారి కాంగ్రెస్ అధ్యక్ష పదవి దూరంగా ఉండాలని గాంధీ కుటుంబం భావిస్తోంది. ఎన్నికల్లో కలుగచేసుకోవద్దని.. అర్హత ఉన్నవారు పదవికి పోటీ చేయాలని గాంధీ కుటుంబం పార్టీ నేతలకు చెబుతోంది. ఇదిలా ఉంటే కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీపై రాహుల్ గాంధీ మరోసారి క్లారిటీ ఇచ్చారు. తాను పోటీలో ఉండటం లేదని.. ఇప్పటికే ఈ విషయాన్ని చాలా సార్లు చెప్పాననే.. నేను దానిపైనే ఉన్నానని తెలిపారు. భారత్ జోడో యాత్ర ప్రస్తుతం కేరళలో జరుగుతుంది. కొచ్చిలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి కాంగ్రెస్ అధ్యక్ష పదవిపై కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవి కేవలం పదవి మాత్రమే కాదని.. ఇది దేశానికి ప్రాతినిధ్యం వహించడమని ఆయన అన్నారు.
Read Also: Munugode By Poll: మునుగోడు ఉపఎన్నికకు 16 మందితో బీజేపీ స్టీరింగ్ కమిటీ
కాంగ్రెస్ అధ్యక్ష పదవి రేసులో తొలి నుంచి రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ పేరు వినిపిస్తోంది. అయితే ఆయన మాత్రం రాహుల్ గాంధీనే అధ్యక్ష బాధ్యతలు చేపట్టే విధంగా ఒత్తడి తీసుకురావాలనే ప్రయత్నంలో ఉన్నారు. రాహుల్ గాంధీని కలిసేందుకు కొచ్చిన్ వెళ్లారు. ఇక మరికొన్ని పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ నేత శశి థరూర్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అయితే వీరిద్దరితో పాటు మరో ఇద్దరు సీనియర్ నాయకులు కూడా అధ్యక్ష రేసులో ఉంటారనే వార్తలు వినిపిస్తున్నాయి. సీనియర్ నేతలు కమల్ నాథ్, మనీష్ తివారీ కూడా కాంగ్రెస్ అధ్యక్ష రేసులో ఉంటారని తెలుస్తోంది. అయితే గాంధీ కుటుంబానికి వీరవిధేయుడిగా ఉన్న అశోక్ గెహ్లాట్ వైపే ఎక్కువ మంది మొగ్గు చూపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
వీరితో పాటు మాజీ కేంద్ర మంత్రులు మనీస్ తివారీ, పృథ్వీరాజ్ చవాన్, ముకుల్ వాస్నిక్, మల్లికార్జున్ ఖర్గే, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్లు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే చవాన్, ముకుల్ వాస్నిక్ మాత్రం ఈ వార్తలను ఖండించారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. సెప్టెంబర్ 24 నుంచి 30 వరకు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. అక్టోబర్ 1న నామినేషన్ల పరిశీలన..అక్టోబర్ 8 వరకు అభ్యర్థులు నామినేషన్లను విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంది. అక్టోబర్ 17న పోలింగ్, అక్టోబర్ 19న ఓట్ల లెక్కింపుతో పాటు ఫలితాలను ప్రకటించనున్నారు.