DK Shivakumar: కర్ణాటక ముఖ్యమంత్రి ఎంపిక కాంగ్రెస్ పార్టీలో మంటలు పుట్టిస్తోంది. గత నాలుగు రోజుల నుంచి అధిష్టానం ఎన్ని చర్చలు జరిపినా సీఎం అభ్యర్థి ఖరారు కాలేదు. తాజా పరిణామాలను బట్టి చూస్తే దాదాపుగా సీఎం పీఠం మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకే కన్ఫామ్ అయినట్లు తెలుస్తోంది. సీఎం సీటుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ కు నిరాశే ఎదురయ్యే అవకాశాలే ఉన్నట్లు సమాచారం. ఇటు డీకే, అటు సిద్ధరామయ్య ఖర్గే, రాహుల్ గాంధీలతో ఈ రోజు వరసగా సమావేశం అయ్యారు.
ఇదిలా ఉంటే కాంగ్రెస్ అధిష్టానం డీకే శివకుమార్ ముందు రెండు ఆఫర్లు ఉంచినట్లు తెలుస్తోంది. అయితే సీఎం సీటు తప్పితే తనకు ఏదీ వద్దని డీకే శివకుమార్ అధిష్టానానికి స్పష్టంగా తెలియజేశారు. హైకమాండ్ ఇచ్చిన రెండు ఆఫర్లను ఆయన తిరస్కరించినట్లు తెలుస్తోంది.
Read Also: China: చైనాలో ఇంతే.. ఆర్మీపై జోక్ చేసినందుకు భారీ జరిమానా..
ఆఫర్ 1: డీకే శివకుమార్ రాష్ట్ర పీసీసీ ప్రెసిడెంట్ గా కొనసాగించడంతో పాటు ఉపముఖ్యమంత్రి పదవితో పాటు ఆయనకు నచ్చిన 6 మంత్రిత్వ శాఖలను ఆఫర్ చేశారు. సామరస్యంగా సమస్యను పరిష్కరించుకోవడానికి అధిష్టానం ఈ ప్రతిపాదన చేసింది.
ఆఫర్ 2: సిద్దరామయ్య, డీకే శివకుమార్ మధ్య అధికార భాగస్వామ్యం. దీంట్లో మొదటి రెండేళ్లు సీఎంగా సిద్ధరామయ్య.. ఆ తరువాత మూడేళ్లు సీఎంగా డీకే శివకుమార్ ఉండేలా అధిష్టానం ఈ ఆఫర్ చెప్పింది. అయితే శివకుమార్ గత నాలుగేళ్లుగా పార్టీ కోసం పనిచేసిన విధానాన్ని అధిష్టానం ముందుంచి సీఎం పదవి మాత్రమే కావాలని డిమాండ్ చేసినట్లు వినికిడి.
డీకే శివకుమార్ కర్ణాటకలో వొక్కలిగ వర్గానికి చెందనవారు. సంప్రదాయంగా వొక్కలిగ వర్గం జేడీయూకు మద్దతు ఇస్తుంటుంది. అయితే ఈ సారి ఆ వర్గం ఎక్కువగా ఉండే ఓల్డ్ మైసూర్ రిజీయన్లో కాంగ్రెస్ అత్యధిక స్థానాలు సాధించింది. ఇదిలా ఉంటే సిద్ధరామయ్యకు మైనారిటీలు, ఓబీసీల్లో మంచి పలుకుబడి ఉంది. ప్రస్తుతం వీరిద్దరిని సంతృప్తి పరిచేందుకు కాంగ్రెస్ అధిష్టానం అష్టకష్టాలు పడుతోంది. ఈ పరిణామాలు రాజస్థాన్ లో సీఎం అశోక్ గెహ్లాట్, యువనేత సచిన్ పైలట్ మధ్య ఉన్న విభేదాల వలే కర్ణాటక కాంగ్రెస్ లో కూడా అసమ్మతి పోరు తప్పకపోవచ్చు.