నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కాంగ్రెస్ అధినేత్రికి ఇటీవల సమన్లు జారీ చేసింది. విచారణకు హాజరుకావాలని కోరింది. అయితే ఈ లోపే ఆమె కరోనా బారిన పడ్డారు. నిజానికి ఈనెల 8 సోనియా గాంధీ ఈడీ ముందు హాజరుకావాల్సి ఉన్నా.. కరోనా కారణంగా ఆమెను జూన్ 23న విచారణకు హాజరు కావాల్సిందిగా ఈడీ తాజా నోటిసులు జారీ చేశారు.
ఈ కేసులో కాంగ్రెస్ నాయకుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీని కూడా ఈడీ విచారణకు రావాల్సిందిగా కోరింది. జూన్ 2 హాజరుకావాలని కోరినప్పటికీ.. ఆ సమయంలో రాహుల్ గాంధీ విదేశాల్లో ఉండటంతో వేరే తేదీని కేటాయించాల్సిందిగా ఈడీని కోరారు. దీంతో జూన్ 13న తమ ముందు హాజరుకావాలని ఈడీ నోటిసులు జారీ చేసింది. ఇప్పటికే ఈ కేసులో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మల్లికార్జున ఖర్గేతో పాటు పవన్ బన్సాల్ లను ఎప్రిల్ లో ఈడీ ప్రశ్నించింది.
2013లో బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి వేసిన పిటిషన్ ఆధారంగా ఈడీ విచారణ జరుపుతోంది. అయితే కాంగ్రెస్ పార్టీ ఈడీ చర్యలను తీవ్రంగా విమర్శిస్తోంది. కావాలనే బీజేపీ ప్రభుత్వం కేంద్ర విచారణ సంస్థలను దుర్వినియోగం చేస్తోందని, కాంగ్రెస్ పై కక్ష సారిస్తోందని విమర్శిస్తున్నారు.ఇదిలా ఉంటే రాహుల్ గాంధీకి ఈడీ నోటిసులు ఇవ్వడంపై దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఫైర్ అవుతున్నాయి. జూన్ 13న దేశవ్యాప్తంగా సత్యాగ్రహ దీక్షలకు పిలుపునిచ్చింది కాంగ్రెస్ పార్టీ.