Site icon NTV Telugu

Salman Khurshid: ‘‘ప్రధాన సమస్య ముగిసింది’’.. ఆర్టికల్ 370 రద్దును ప్రశంసించిన కాంగ్రెస్ నేత..

Salman Khurshid

Salman Khurshid

Salman Khurshid: కాంగ్రెస్ నేత, మాజీ విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ ఆర్టికల్ 370ని రద్దు చేయడాన్ని ప్రశంసించారు. జమ్మూ కాశ్మీర్‌కి ప్రత్యేక హోదా ఇచ్చే రాజ్యాంగంలోని ఈ ఆర్టికల్, భారతదేశంలోని మిగతా ప్రాంతాల నుంచి వేరుగా ఉందనే భావనను చాలా కాలం సృష్టించిందని, ప్రభుత్వం ఈ ఆర్టికల్ 370ని రద్దు చేయడంతో ఈ భావన ముగిసిందని అన్నారు. ఆపరేషన్ సిందూర్‌ తర్వాత, పలు దేశాలకు భారత దౌత్య బృందాలు వెళ్లాయి. పాక్ ఉగ్రవాదం గురించి ఆయా దేశాలకు ఈ బృందాలు వివరించనున్నాయి. ఇండోనేషియాకు వెళ్లిన బృందంలో సల్మాన్ ఖుర్షీద్ కూడా ఉన్నారు. ఇండోనేషియా ప్రతినిధి బృందంతో సంభాషిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Read Also: Liquor Case: లిక్కర్ కేసులో సిట్ కస్టడీకి నలుగురు నిందితులు.. విచారణకు కోర్టు అనుమతి..!

ఆర్టికల్ 370 రద్దు తర్వాత, జమ్మూ కాశ్మీర్‌లో అభివృద్ధి, ఇటీవల జరిగిన ఎన్నికల్ని ఆయన ప్రస్తావించారు. జమ్మూ కాశ్మీర్‌లో ఎన్నికల్లో 65 శాతం ఓటర్ల భాగస్వామ్యం ఉందని, ఇది కాశ్మీర్‌లో ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు దోహదపడిందని చెప్పారు. ఆగస్టు 2019లో ఆర్టికల్ 370ని బీజేపీ నేతృత్వంలోని ప్రధాని మోడీ ప్రభుత్వం రద్దు చేసింది. దీనిని కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ కొనియాడటం గమనార్హం. ఇటీవల, ప్రధాని మోడీ నిర్ణయాలను, ఆపరేషన్‌ సిందూర్‌ని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ప్రశంసించడం హస్తం పార్టీలో సంచలనంగా మారింది. ఇప్పుడు ఆర్టికల్ 370ని ఖుర్షీద్ ప్రస్తావిచడంపై కాంగ్రెస్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

Exit mobile version