Congress: కేరళ చిత్ర పరిశ్రమ ‘‘మాలీవుడ్’’లో హేమా కమిటీ నివేదిక సంచలనాన్ని సృష్టించింది. ఇండస్ట్రీలో మహిళలపై లైంగిక వేధింపులను వెలుగులోకి తెచ్చింది. ఈ రిపోర్టు సంచలనంగా మారిన తరుణంలోనే కేరళ కాంగ్రెస్‌లో కూడా ఫిలిం ఇండస్ట్రీ తరహాలోనే ‘‘కాస్టింగ్ కౌచ్’’ ఉందని ఆ పార్టీకి చెందిన మహిళా నేత రోజ్‌బెన్ జాన్ ఆరోపించడం సంచలనంగా మారింది. ఆమె ఆరోపణలు చేసిన కొన్ని గంటల్లోనే పార్టీ ఆమెను తొలగించింది.
మీడియా ముందు మహిళా నేతలను అవమానించినందుకు సిమి రోజ్‌బెల్ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేసినట్లు కేరళ పీసీసీ అధికార ప్రకటనలో తెలిపింది. రాజకీయ ప్రత్యర్థులతో కుమ్మక్కై, కాంగ్రెస్‌లోని లక్షలాది మంది మహిళా నాయకురాలు , పార్టీ కార్యకర్తలను మానసికంగా వేధించడం, పరువు తీయడమే లక్ష్యంగా రోజ్‌బెల్ ఆరోపణలు ఉన్నాయని కూడా ప్రకటన పేర్కొంది. కాగా తన బహిష్కరణపై రోజ్‌బెల్ స్పందించారు. పరువు, ప్రతిష్ట ఉన్న ఏ మహిళా కూడా కాంగ్రెస్ పార్టీ పనిచేయదని అన్నారు.
Read Also: JP Nadda: మాలీవుడ్ లైంగిక వేధింపుల రిపోర్ట్‌పై కేరళ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన జేపీ నడ్డా..
కాంగ్రెస్ పార్టీలో మహిళలు దోపిడీకి గురవుతున్నారని, ఎర్నాకులంకి చెందిన కాంగ్రెస్ మహిళా నేత సిమి రోజ్‌బెల్ శనివారం సంచలన ఆరోపణలు చేయడం ఆ పార్టీని ఇరకాటంలో పెట్టాయి. పార్టీలో అవకాశాలు పొందేందుకు తరుచుగా మహిళలు దోపిడీకి గురవుతున్నారని ఆమె ఓ ప్రాంతీయ వార్తా ఛానెల్‌లో మాట్లాడారు. రోజ్‌బెల్ కాంగ్రెస్ నేత, ప్రతిపక్ష నాయకుడు వీడీ సతీశన్‌తో సహా పలువురు కాంగ్రెస్ నేతలపై లైంగిక ఆరోపణలు చేశారు. పురుష నాయకుల్ని ‘‘ఆకట్టుకోవడం’’ ద్వారానే మహిళలు ముఖ్యమైన స్థానాలకు ఎదుగగలరని, తరుచుగా ప్రతిభ, అనుభవం అవసరం లేదని ఆమె చెప్పారు.
రోజ్‌బెల్ ఆరోపణల్ని అబద్ధమని సతీశన్ తోసిపుచ్చారు. మేము ఆమెకు చాలా మద్దతు ఇచ్చామని, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ(ఏఐసీసీ)లో కూడా పదవులు దక్కించుకుందని అన్నారు. ఆమె ఆరోపణలన్నీ అబద్ధమన్నారు. సిమి రోజ్‌బెల్‌పై మహిళా కాంగ్రెస్ ఫిర్యాదు చేసిందని, విచారణ జరుపుతున్నామని కేరళ పీపీసీ చీఫ్ సుధాకరన్ అన్నారు.