Bharat Jodo Yatra 2.0: నిస్తేజంగా ఉన్న కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’ ఊపు తీసుకువచ్చింది. మొదటిదశ సెప్టెంబర్ 7, 2022న తమిళనాడులోని కన్యాకుమారి నుండి ప్రారంభమైంది. దాదాపు 4,080 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తూ, యాత్ర జనవరి 2023లో జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ముగిసింది. మొత్తం 12 రాష్ట్రాల్లోని 75 జిల్లాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల గుండా 126 రోజుల పాటు సాగింది. ఈ యాత్ర కాంగ్రెస్ పార్టీకి మంచి మైలేజ్ ఇచ్చింది. రాహుల్ గాంధీ పాదయాత్రలో భాగంగా యువత, ఉద్యోగులు, రైతులతో మమేకమయ్యారు. పలు ప్రాంతాల్లో బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ఆయా రాష్ట్రాల్లోని కాంగ్రెస్ నేతలు జోడో యాత్రలో రాహుల్ వెంట నడిచారు.
Read Also: Nama Nageswara Rao : రైతుల ఆత్మహత్యలు పెరిగిందే కాంగ్రెస్ పాలనలో
ఇదిలా ఉంటే మొదటి విడత యాత్ర ద్వారా వచ్చిన ప్రజాస్పందనను మరోసార రిపీట్ చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో లోకసభ ఎన్నికల ముందు ఈ యాత్ర ఉండేలా కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అంతకుముందు కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం కూడా రెండో విడత జోడో యాత్రకు ప్లాన్ చేస్తున్నట్లు వెల్లడించారు.
భారత్ జోడో యాత్ర 2.0 పాదయాత్ర డిసెంబర్ 2023- ఫిబ్రవరి 2024 మధ్య ఉండే అవకాశం ఉంది. పాదయాత్రతో పాటు వాహనాల ద్వారా యాత్రను నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. మొదటి యాత్ర దేశంలోని దక్షిణం నుంచి తూర్పు వైపు సాగితే, ఈసారి తూర్పు నుంచి పడమర వైపు భారత్ జోడో యాత్ర ఉండే అవకాశం ఉంది. గతేడాది యాత్రలో రాహుల్ గాంధీ దేశంలోని నిరుద్యోగం, ద్రవ్యోల్భణం మీద కేంద్రంలోని బీజేపీ పార్టీపై విరుచుకుపడ్డారు. ఈ యాత్ర తర్వాత జరిగిన కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల ముందు దేశంలో కాంగ్రెస్ వేవ్ ఏర్పడేలా యాత్రను ప్లాన్ చేస్తోంది గ్రాండ్ ఓల్డ్ పార్టీ.