PoK: కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మరోసారి పాక్ ఆక్రమిత కాశ్మీర్(PoK)పై కీలక వ్యాఖ్యలు చేశారు. పీఓకే లోని ప్రజలే భారత్‌లో విలీనం కావాలనే డిమాండ్‌ని లేవనెత్తతున్నారని అన్నారు. పీఓకే భారత్‌లో విలీనం అవుతుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఓ జాతీయ మీడియా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కాశ్మీర్‌పై పాకిస్తాన్ పీఎం షెహబాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. ‘‘వాళ్లు కాశ్మీర్‌ని ఎప్పుడైనా స్వాధీనం చేసుకోగలరా.? వారు పీఓకే గురించి ఆందోళన చెందాలి. అక్కడి ప్రజలు భారత్‌లో విలీనాన్ని డిమాండ్ చేసే పరిస్థితి ఏర్పడుతోందని నేను ఏడాదిన్నర క్రితమే చెప్పాను’’అని రాజ్ నాథ్ సింగ్ అన్నారు.
ప్రభుత్వం ఏదైనా ప్రణాళికను రూపొందిస్తుందా?? అనే ప్రశ్నకు బదులిస్తూ..‘‘ఇంకేమి చెప్పను. మేం ఏ దేశంపైనా దాడి చేయబోవడం లేదు. ప్రపంచంలో ఏ దేశంపైనా దాడి చేయని లక్షణం భారత్‌కి ఉంది. ఇతర దేశాలకు చెందిన అంగుళం భూమిని భారత్ ఎప్పుడూ ఆక్రమించలేదు. కానీ పీఓకే మనది, అది స్వయంగా భారత్‌లో విలీనం అవుతుందనే నమ్మకం నాకు ఉంది’’ అని చెప్పారు. ఫిబ్రవరి నెలలో పీఓకేలోని రాజకీయ కార్యకర్త అమ్జద్ అయూబ్ మీర్జా ఓ వీడియోలో మాట్లాడుతూ.. పాకిస్తాన్ తీరుతో పీఓకే ప్రజలు విసిగిపోయారని, వారు ఇప్పుడు భారత్‌లో విలీనం కావాలని డిమాండ్ చేస్తున్నారని పేర్కొన్నారు.
Read Also: Kamal Haasan: రాముడు అగ్నిపరీక్ష నిర్వహించినట్లే.. ఈవీఎంలను పరీక్షిస్తాం..
భారత్‌పై చైనా దాడి చేస్తుందా..? అని అడిగిన ప్రశ్నకు రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. ఇలాంటి తప్పులు చేయవద్దనే బుద్ధి ఆ దేశానికి ఇవ్వాలని, ఏ దేశంపైనా దాడులు చేయని గుణం భారత్‌లో ఉందని, అయితే మన దేశంపై దాడి చూస్తే మాత్రం వదిలిపెట్టబోమని అన్నారు. మన పొరుగువారితో మంచి సంబంధాలు ఉండాలని ఆయన కాంక్షించారు. దేశం ప్రతిష్టపై, దేశంపై దాడి చేసేవారికి బుద్ధి చెప్పే శక్తి భారత్‌కి ఉందన్నారు. చైనా నుంచి ఎలాంటి ముప్పు వచ్చినా ఎదుర్కొనే సత్తా భారత్‌కి ఉందన్నారు. భారత్ బలహీన దేశం కాదని, ప్రపంచంలోనే శక్తివంతమైన దేశంగా మారిందని అన్నారు.
మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చైనా సరిహద్దు వెంబడి మౌలిక సదుపాయాలను వేగవంతం చేసిందని రాజ్ నాథ్ చెప్పారు. జవాన్ల త్యాగాలను రాహుల్ గాంధీ లాంటి వారు అవహేళన చేస్తున్నారని మండిపడ్డారు. గాల్వాన్ పోరాటంలో మన జనాన్లు 20 మంది మరణించారు. అయితే, విదేశీ సంస్థలు మాత్రం ఈ ఘర్షణలో 35 నుంచి 40 మంది చైనా సైనికులు మరణించినట్లు చెబుతున్నాయని ఆయన అన్నారు.