Tamil Nadu: తమిళనాడులో టాప్ పోలీస్ ఆఫీసర్ పిస్టల్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 2009 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారి విజయ్ కుమార్ శుక్రవారం కోయంబత్తూర్ నగరంలో తన నివాసంలో డ్యూటీలో ఉన్న సెక్యురిటీ అధికారి నుంచి పిస్టల్ తీసుకుని, కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. విజయ్ కుమార్ ప్రస్తుతం కోయంబత్తూర్ రేంజ్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా విధులు నిర్వర్తిస్తున్నారు.
రేస్ కోర్స్ సమీపంలోని రెడ్ ఫీల్డ్స్‌లోని తన అధికారిక నివాసంలో ఈ ఉదయం 6.15 గంటల ప్రాంతంలో డీఐజీ విజయకుమార్ కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. విజయకుమార్ తీవ్ర డిప్రెషన్‌లో ఉన్నారని, నిద్ర లేకపోవడం సమస్యలు ఎదుర్కొంటున్నట్లు సమాచారం. తరుచుగా డిప్రెషన్ కోసం కౌన్సిలింగ్ తీసుకుంటున్నారు, కొద్ది రోజుల క్రితమే చెన్నై నుంచి కుటుంబాన్ని కోయంబత్తూర్ తీసుకువచ్చారు.
Read Also: Buldhana Bus Accident: బుల్దానా బస్సు ప్రమాదం షాకింగ్ నిజాలు.. తప్పతాగి బస్సు నడిపిన డ్రైవర్
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, విజయకుమార్ తన అధికారిక నివాసంలో డ్యూటీలో ఉన్న గన్‌మ్యాన్ నుంచి పిస్టల్ తీసుకువచ్చి కాల్చుకుని చనిపోయాడని తెలిపారు. అతని నివాసంలో ఉన్న భద్రతా సిబ్బంది వెంటనే సీనియర్ అధికారులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోయంబత్తూర్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. 2009 ఐపీఎస్ బ్యాచ్ అధికారి అయిన విజయ్ కుమార్ ఈ ఏడాది జనవరిలో కోయంబత్తూర్ డీఐజీగా బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు కాంచీపురం, కడలూరు, నాగపట్నం మరియు తిరువారూర్ ఎస్పీగా, అన్నానగర్ డిప్యూటీ కమిషనర్ గా పనిచేశారు.
ముఖ్యమంత్రి, హోం మంత్రిత్వ శాఖ కలిగి ఉన్న ఎంకే స్టాలిన్ విజయ్ కుమార్ అకాల మరణ వార్త విని దిగ్భ్రాంతి చెందినట్లు ట్వీట్ చేశారు. ఎస్పీగా బాగా పనిచేశారని.. అతని మరణం తమిళనాడు పోలీస్ డిపార్ట్మెంట్ కు తీవ్ర నష్టం అని, ఆయన కుటుంబానికి తీవ్ర సానుభూతిని తెలియజేశారు.