CM Vijay: జ్యోతిష్యుడికి కీలక పోస్టు, ఒక్క రోజులోనే తొలగింపు.. విమర్శలకు తలొగ్గిన సీఎం విజయ్..

  • విమర్శలకు తలొగ్గిన సీఎం విజయ్..
  • జ్యోతిష్యుడు రాధన్ పండిత్‌ను ఓఎస్డీగా తొలగింపు..
Cm Vijay

Cm Vijay

CM Vijay: మిత్రపక్షాలు, ప్రతిపక్ష పార్టీల నుంచి వస్తున్న విమర్శలకు సీఎం విజయ్ తలొగ్గారు. జ్యోతిష్యుడు, సీఎం విజయ్ సన్నిహితుడిగా చెప్పబడుతున్న రాధన్ పండిత్ వెట్రివేల్‌ను తమిళనాడు ప్రభుత్వం ‘‘ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ(ఓఎస్డీ)’’గా నియమించింది. నియామకం జరిగిన ఒక్క రోజులోనే ఆయనను ఆ పోస్టు నుంచి తొలగించారు. ఈ నియామకంపై మిత్రపక్షాలైన వీసీకే, లెఫ్ట్ పార్టీలు వ్యతిరేకించాయి. ఒక జ్యోతిష్యుడికి ప్రభుత్వంలో ఏం పని అని విమర్శించాయి. ఈ నేపథ్యంలోనే విజయ్ ఈ నియామకాన్ని రద్దు చేసినట్లు తెలుస్తోంది.

Read Also: KKR Playoffs Scenario: ఇకపై కేకేఆర్‌కు చావోరేవో.. ప్లేఆఫ్స్‌కు చేరాలంటే చివరి వరకు పోరాడాల్సిందే!

పండిట్ రాధన్ పండిత్‌ ఓఎస్డీ పదవికి నియమించడాన్ని రద్దు చేసినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఒక లేఖలో తెలిపారు. బుధవారం అసెంబ్లీలో విజయ్ ప్రభుత్వం బలపరీక్ష సందర్భంగా పలువురు ఎమ్మెల్యేలు ఈ విషయాన్ని లేవనెత్తాయి. మూఢనమ్మకాలుగా భావించే వాటిని పట్టించుకోకుండా, శాస్త్రీయ, తార్కిక ఆలోచనలపై దృష్టి పెట్టాలని వీసీకే ఎమ్మెల్యే వాణి అరసు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

ఇదిలా ఉంటే, ఫ్లోర్ టెస్టుకు ముందు మంత్రి నిర్మల్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘పండిత్ రాధన్ మా పార్టీ అధికార ప్రతినిధిగా ఉణ్నారు. అందుకే మేము ఆయనను నియమించాము. ఆయన జ్యోతిష్యుడు కావడం ఆయన వ్యక్తిగత విషయం, ఎవరినైనా ఓఎస్డీగా నియమించొచ్చు’’ అని అన్నారు. అయితే, విజయ్‌ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న సీపీఎం, సీపీఐ పార్టీలు.. ఒక జ్యోతిష్యుడిని ప్రభుత్వ పదవిలో నియమించడం మూఢనమ్మకాలను మాత్రమే ప్రోత్సహిస్తుందని అన్నారు. ఇలా విమర్శల కారణంగా విజయ్ వెనక్కి తగ్గాల్సి వచ్చింది.