2020 జులైలో వెలుగుచూసిన కేరళ గోల్డ్ స్కామ్ వ్యవహారం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ కేసులో ప్రధాన నిందితురాలైన స్వప్న సురేశ్.. ఇప్పటికే 16 నెలలపాటు జైలు శిక్ష అనుభవించింది. గతేడాది నవంబర్ నెలలో ఆమె బయటకొచ్చింది. అప్పట్నుంచి ఈ కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. తాజాగా ఆమె ఈ స్కామ్‌లో కేరళ సీఎం పినరయి విజయన్ హస్తం ఉందంటూ స్వప్న సురేశ్ బాంబ్ పేల్చింది. ఇప్పటికే మనీలాండరింగ్ కేసులో ఆయనకు వ్యతిరేకంగా ఈమె కోర్టులో వాంగ్మూలం ఇచ్చిన సంగతి తెలిసిందే! ఇప్పుడు గోల్డ్ స్కామ్‌లో ఆయన పేరు తీసుకొచ్చి, పెను సంచలనానికి దారి తీసింది.
ఈ క్రమంలోనే మీడియా ముందుకొచ్చిన స్వప్న.. ‘‘నన్ను హింసించింది చాలు, ఇక తట్టుకోలేకపోతున్నా, దయచేసి నన్ను చంపేసి ఈ కథకు ముగింపు పలకండి. నా చుట్టూ ఉన్న వ్యక్తుల్ని బాధపెట్టొద్దని మొరపెట్టుకుంటున్నా’’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. తనని ఏకాకిని చేసేందుకే తన లాయర్ కృష్ణరాజ్‌పై ఫేస్‌బుక్‌లో మతపరమైన విశ్వాసాలను దెబ్బతీసేలా పోస్ట్ పెట్టారంటూ నాన్-బెయిలబుల్ కేసు పెట్టారని ఆమె వాపోయింది. సీఎం విజయ్‌కు అనుచరుడైన షాజ్ కిరణ్ చెప్పినట్టే అన్నీ జరుగుతున్నాయని ఆరోపించింది. ఇంతకుముందు సరిత్‌ని అరెస్ట్ చేస్తారని షాజ్ చెప్పాడని, అలాగే జరిగిందని వివరించింది. ఇప్పుడు లాయర్ కృష్ణరాజ్ విషయంలో కూడా సరిగ్గా షాజ్ కిరణ్ చెప్పినట్టే జరిగిందంటూ స్వప్న వెల్లడించింది.
కోర్టులో తాను సీఎంకి వ్యతిరేకంగా ఇచ్చిన వాంగ్మూలంలో ఎలాంటి వ్యక్తిగత, రాజకీయ అజెండా లేదని స్వప్న స్పష్టం చేసింది. ఆమె వాంగ్మూలం ఇచ్చిన వెంటనే.. విజిలెన్స్ & యాంటీ కరప్షన్ బ్యూరో బృందం రంగంలోకి దిగి, పాల్కడ్‌లోని ఉన్న పీఎస్ సరిత్‌ని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తన వద్ద సాక్ష్యాలు ఉండటం వల్లే సీఎంకు వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇచ్చానని స్వప్న చెప్తోంది. తనకు బెదిరింపులు కూడా వస్తున్నాయని ఆమె బాంబ్ పేల్చింది. సీఎం నుంచి తనకు ప్రాణ హాని ఉందని, తనపై కక్ష కట్టారని ఆరోపిస్తోంది. తన ఆరోగ్యం ఏమాత్రం బాగోలేదని, అయినా మీడియా ముందుకు రాక తప్పలేదని చెప్పింది. గోల్డ్ స్కామ్ కేసుకు సంబంధించి తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని స్వప్న స్పష్టం చేసింది.
మొత్తానికి.. కేరళ గోల్డ్ స్కామ్‌లో సీఎం విజయన్ పాత్ర కచ్ఛితంగా ఉందని స్వప్న సురేశ్ పదే పదే కుండబద్దలు కొట్టినట్టు చెప్తోంది. ఆమెను ఇబ్బంది పెట్టేందుకు తాజా పరిణామాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో.. ఆ అనుమానాలు మరింత బలపడుతున్నట్టు కనిపిస్తున్నాయని విశ్లేషకులు చెప్తున్నారు. అయితే.. సీఎం మాత్రం స్వప్న ఆరోపణల్ని ఖండిస్తున్నారు. అవి నిరాధారమైన ఆరోపణలని కొట్టి పారేశారు. ఈ వ్యవహారంలో మున్ముందు మరెన్ని ట్విస్టులు వెలుగుచూస్తాయో చూడాలి.