కేంద్ర ప్రభుత్వంపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మరోసారి విమర్శలు గుప్పించారు. తాజాగా కేజ్రీవాల్ మాట్లాడుతూ.. అక్రమ నిర్మాణాల పేరుతో బీజేపీ బుల్డోజర్లతో ప్రజల ఇండ్లు, దుకాణాలను కూల్చివేయడం సరైంది కాదని, స్వాతంత్ర్యం తరువాత ఇదే దేశంలో అతి పెద్ద విధ్వంసమని ఆయన అభివర్ణించారు. ఢిల్లీలో కాషాయ పార్టీ బుల్డోజర్లు ఇదే తరహాలో తిరిగితే నగరంలో 63 లక్షల మంది ప్రజలు నిరాశ్రయులవుతారని కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేశారు.
ఢిల్లీలో ఆక్రమణలను మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (ఎంసీడీ) కూల్చివేస్తోందని అన్నారు. ఈ ప్రక్రియలో కీలక అంశాలను గుర్తుంచుకోవాలని చెబుతూ ఢిల్లీలో ప్రజలు తమ ఆస్తులకు సంబంధించిన పత్రాలను చూపినా కూల్చివేతలు కొనసాగిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఢిల్లీలోని మురికివాడలు, గుడిసెలను నేలమట్టం చేస్తున్నారన్న కేజ్రీవాల్.. ఇలాగే కాషాయ పార్టీ ఆధ్వర్యంలోని మున్సిపల్ కార్పొరేషన్‌లు కూల్చివేత ప్రక్రియను కొనసాగిస్తూ బుల్డోజర్లకు పనిచెబితే 63 లక్షల మంది ఢిల్లీ ప్రజలు జీవితాలు చిన్నాభిన్నమవుతాయన్నారు.
మురికివాడల్లో ఇండ్లు కట్టిస్తామని హామీ ఇచ్చిన బీజేపీ దానికి బదులుగా బుల్డోజర్లతో నిర్మాణాలను కూల్చివేస్తున్నారని, 15 ఏండ్ల పాటు ఎంసీడీ పాలనా పగ్గాలు చేపట్టిన కాషాయ పార్టీయే అక్రమ నిర్మాణాలకు బాధ్యత వహించాలని కేజ్రీవాల్ మండిపడ్డారు.