CAA: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) కింద మొదటి దశ పౌరసత్వ ధృవీకరణ పత్రాలు జారీ చేసిన తర్వాత రెండు వారాల లోపే పశ్చిమ బెంగాల్‌లోని లబ్ధిదారులకు సీఏఏ పత్రాలు అందించే ప్రక్రియ ప్రారంభమైంది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన మొదటి దరఖాస్తుదారులకు రాష్ట్ర సాధికార కమిటీ పౌరసత్వం మంజూరు చేసిందని హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. మే 15న న్యూఢిల్లీలో దరఖాస్తుదారులకు చట్టం ప్రకారం మొట్టమొదటి సర్టిఫికేట్‌ల సెట్‌ను అందజేయడం జరిగింది.
అయితే బెంగాల్ వ్యాప్తంగా సీఏఏ అమలు కష్టంగా మారింది. ముఖ్యంగా బెంగాల్‌లోని మమతా బెనర్జీ సర్కార్ దీనిని వ్యతిరేకిస్తోంది. హర్యానా, ఉత్తరాఖండ్ రాష్ట్రాల సాధికార కమిటీలు కూడా మొదటి దరఖాస్తుదారులకు పౌరసత్వాన్ని మంజూరు చేసినట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తెలిపింది.
Read Also: Madhya Pradesh: వందేభారత్ లో భారీ పేలుడు.. భయాందోళనలో ప్రయాణికులు
పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్‌లో మైనారిటీలుగా ఉండీ, వేధింపులకు గురై డిసెంబర్ 31, 2014 లేదా అంతకు ముందు భారతదేశానికి శరణార్థులుగా వచ్చిన హిందువులు, జైనులు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు మరియు పార్సీలలకు ఈ సీఏఏ చట్టం ప్రకారం భారత పౌరసత్వాన్ని కల్పించనున్నారు. వీరి అర్హత వ్యవధిని 11 నుంచి 5 ఏళ్లకు తగ్గించింది. సీఏఏ నియమాలు ఈ ఏడాది మార్చిలో నోటిఫై చేయబడ్డాయి.
మరోవైపు ఈ ఎన్నికల ప్రచారంలో సీఏఏ బెంగాల్ ప్రచారంలో ప్రముఖంగా మారింది. బీజేపీ నేతలతో పాటు ప్రధాని నరేంద్రమోడీ మాట్లాడుతూ.. మమతా బెనర్జీ బంగ్లాదేశ్ నుంచి చొరబాటుదారులను ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు. బెంగాల్ సరిహద్దుల్లో జనాభా స్వరూపం మార్చబడుతోందని, మతపరమైన హింసకు గురైన వారికి పౌరసత్వం ఇవ్వడానికి టీఎంసీ వ్యతిరేకమని, ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటూ ప్రశ్నించారు. బెంగాల్‌లో హిందువులు, మతువా కమ్యూనిటీలు ఉండకూడదని టీఎంసీ భావిస్తోందని దుయ్యబట్టారు. అయితే మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్‌లో సీఏఏ, ఎన్ఆర్సీ, యూసీసీని అమలు చేయకుండా అడ్డుకుంటానని, ఇందుకు ప్రాణత్యాగానికి కూడా వెనకాడనని అన్నారు.