సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి కొత్త బాస్ వచ్చేశాడు… 1985 బ్యాచ్ మహారాష్ట్ర కేడర్ ఐపీఎస్ అధికారి అయిన సుబోధ్ జైస్వాల్ సీబీఐ కొత్త డైరెక్టర్‌గా నియమితులయ్యారు. బాధ్యతలు స్వీకరించిన తేదీ నుండి ఆయన రెండు సంవత్సరాల పాటు ఈ కీలక బాధ్యతల్లో ఉండనున్నారు.. తెల్గి కుంభకోణం దర్యాప్తులో కీలక పాత్ర పోషించి ప్రసిద్ధి చెందిన జైస్వాల్.. సీబీఐ చీఫ్ వరకు ఎదిగారు.. ప్రస్తుతం కేంద్ర పారిశ్రామిక భద్రతా దళానికి (సిఐఎస్ఎఫ్) చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ అంతకుముందు మహారాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ గా పనిచేశారు. మహారాష్ట్ర డిజిపిగా ఉన్న కాలంలో, శివసేన నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వంతో బదిలీ విధానంతో సహా పలు అంశాలపై ఆయనకు విభేదాలు ఉన్నాయి. చట్టంలోని నిబంధనల ప్రకారం ఐపిఎస్ అధికారులను పదవీకాలం రెండేళ్లు పూర్తిచేసే ముందు బదిలీ చేయడాన్ని ఆయన వ్యతిరేకించారు.
ఇక, ముంబై టెర్రరిజం యాంటీ స్క్వాడ్, మహారాష్ట్ర పోలీస్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్) మరియు స్టేట్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌లో కూడా ఆయన పనిచేశారు. ఆ తర్వాత కేంద్ర డిప్యుటేషన్‌లో స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్‌పిజి) తో మరియు దేశ బాహ్య ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయిన రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్ (ఆర్‌అండ్‌డబ్ల్యు) తో కలిసి పనిచేశారు. మరోవైపు.. సీబీఐ చీఫ్ ఎంపిక ప్రక్రియలో ఎటువంటి వివాదం ఉండకూడదని సీజేఐ సోమవారం సమావేశంలో స్పష్టం చేశారు.. పదవీ విరమణలో ఆరు నెలల కన్నా తక్కువ సమయం మిగిలి ఉన్న అధికారులు సిబిఐ చీఫ్ పదవికి పరిగణించరాదని కూడా కొందరు సూచించారు.. మొత్తంగా 90 నిమిషాల పాటు మంతనలు జరిపిన ప్యానెల్ సుబోధ్ జైస్వాల్ ను నియమించింది.