డ్రగ్స్.. రెండు తెలుగు రాష్ట్రాలే కాదు.. యావత్ భారతాన్ని వణికిస్తున్న మహాజాడ్యం. దేశంలో ఎక్కడో చోట డ్రగ్స్, గంజాయి, మత్తుపదార్దాలు పట్టుబడుతున్నాయి. చెన్నై మహానగరంలో డ్రగ్స్ చాక్లెట్స్ కలకలం రేపాయి. నగరంలోని వివిధ స్కూల్స్ , కాలేజీల సమీపంలో డ్రగ్స్ చాక్లెట్స్ విక్రయిస్తున్నట్టు వచ్చిన ఫిర్యాదులపై అధికారులు తీవ్రంగా స్పందించారు. వెంటనే రంగంలోకి దిగి ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో విభ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తోంది.
పాఠశాల విద్యార్ధులు, కాలేజీ స్టూడెంట్స్ యువత టార్గెట్ గా డ్రగ్స్ తయారీ, అమ్మకం ముఠాలు తమ కార్యకలాపాలు సాగిస్తున్నాయి. కిరాణా స్టోర్స్ , సూపర్ మర్కెట్లలో తనిఖీలు నిర్వహించిన అధికారులకు మైండ్ బ్లాంక్ అయింది. తనిఖీలలో ఎటువంటి వివరాలు లేని చాక్లెట్స్ , ఐస్ క్రీంలు విక్రయిస్తున్నట్టు తేలడం తో వాటిని ల్యాబ్ కి పంపించారు అధికారులు. స్టోర్స్ లో విక్రయిస్తున్న జెల్లీ , ఐస్ క్రీం, చాక్లెట్స్ అన్నింటిని స్వాధీనం చేసుకున్నారు అధికారులు.
వీటిలో ఏమేరకు డ్రగ్స్ వినియోగించారనేది తేలాల్చి వుంది. ఈ డ్రగ్స్ చాక్లెట్స్ తయారీదారుల ఆచూకీ కోసం పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. గుజరాత్ లో 1500 కోట్ల రూపాయల విలువైన హెరాయిన్ పట్టుబడడంతో దేశం అప్రమత్తం అయింది. అసలేం జరుగుతోందో ఆలోచించేలోపే చెన్నైలో డ్రగ్స్ చాక్ లెట్స్, క్యాండీలు పట్టుబడడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. తమ పిల్లలకు వీటికి బానిసలయితే తమ పరిస్థితి ఏంటనేది వారి మదిని తొలిచేస్తోంది. ఆదిలోనే ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయకపోతే ఉడ్తా చెన్నై అవుతుందనే ఆందోళన వ్యక్తం అవుతోంది.
Read Also: Mavoists Arrest: గడ్చిరోలిలో నలుగురు మావోయిస్టుల అరెస్ట్