Wedding: పెళ్లిలో వరుడు, వధువు బంధువులు ఘర్షణకు దిగిన ఘటన బీహార్ లోని బోధ్ గయాలో జరిగింది. కేవలం ‘‘రసగుల్లా’’ తక్కువైందని ఇరు వర్గాలు రచ్చరచ్చ చేశారు. ఇరువైపుల నుంచి కుటుంబ సభ్యులు, అతిథులు ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకోవడంతో పాటు, కుర్చీలతో దాడులు చేసుకున్నారు. రసగుల్లా కారణంగా చివరకు వివాహం రద్దు అయింది. దీంతో వధువు కుటుంబం వరుడి కుటుంబంపై వరకట్న కేసు నమోదు చేసిందని పోలీసులు తెలిపారు. నవంబర్ 29న బుద్ధ గయాలోని ఒక హోటల్‌లో ఈ సంఘటన జరిగింది. వధువు కుటుంబం హోటల్‌లో బస చేసింది. వరుడు, అతడి కుటుంబం సమీపంలోని గ్రామం నుంచి వచ్చారు.
Read Also: MH370 Mystery: ఇప్పటికైనా MH370 మిస్టరీ వీడుతుందా.? దశాబ్ధం క్రితం 239 మందితో విమానం అదృశ్యం..
వివాహ ఆచారాలు ముగిసిన తర్వాత, రసగుల్లా కొరత కారణంగా వధువు కుటుంబం గొడవ ప్రారంభించిందని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత నెమ్మదిగా ఇరు వర్గాలు గొడవకు దిగాయి. కుర్చీలు, ప్లేట్లతో కొట్టుకున్నారు. రెండు వైపులా చాలా మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. రసగుల్లాలు లేకపోవడం వల్లే ఈ గొడవ జరిగిందని వరుడి తండ్రి మహేంద్ర ప్రసాద్ చెప్పారు. ఈ సంఘటన తర్వాత వధువు కుటుంబం తప్పుడు వరకట్నం కేసు నమోదు చేసిందని ఆయన ఆరోపించారు. వరుడి కుటుంబం పెళ్లి జరిగేందుకు ఒప్పుకున్నా, వధువు కుటుంబం మాత్రం ససేమిరా అనడంతో పెళ్లి రద్దయింది. గొడవ జరుగుతున్న సమయంలో వధువు కుటుంబం తాము పెట్టిన బంగారాన్ని తీసుకెళ్లిందని వరుడి తల్లి మున్నీ దేవీ ఆరోపించింది. హోటల్ బుకింగ్స్ కూడా తామే చేశామని చెప్పారు.