Manmohan Singh: భారత మాజీ ప్రధాని, భారత ఆర్థిక వ్యవస్థ రూపశిల్పిగా పేరున్న మన్మోహన్ సింగ్ ఇటీవల మరణించిన విషయం మనకు తెలిసిందే. ఆయన మరణం తర్వాత ఆయన స్మారక చిహ్నంపై బీజేపీ, కాంగ్రెస్ మధ్య వివాదం నెలకొంది. అయితే, కేంద్రం తాజాగా మన్మోహన్ సింగ్ స్మారక చిహ్నం నిర్మించేందుకు ప్రక్రియ ప్రారంభించింది. సోర్సెస్ ప్రకారం.. రాజ్‌ఘాట్, రాష్ట్రీయ స్మృతి స్థల్ లేదా కిసాన్ ఘాట్ సమీపంలో 1 నుండి 1.5 ఎకరాల స్థలం స్మారక చిహ్నం కోసం ప్రతిపాదించబడినట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతాలను ఇప్పటికే పట్టణాభివృద్ధి శాఖ అధికారులు పరిశీలించారు. ఈ రెండు స్థలాల్లో ఒకటి ఎంచుకోవాలని మన్మోహన్ కుటుంబ సభ్యులకు అధికారులు సూచించినట్లు సమాచారం.
Read Also: Mid-Size SUV: 2024లో అత్యంత ప్రజా దారణ పొందిన కారు ఇదే..
కొత్త విధానం ప్రకారం.. స్మారక చిహ్నం కోసం భూమిని ట్రస్ట్‌కి మాత్రమే కేటాయించవచ్చు. ప్రాజెక్టు ప్రారంభించడానికి ఒక ట్రస్ట్ ఏర్పాటు తప్పనిసరి. ట్రస్ట్ స్థాపించిన తర్వాత, భూమి కేటాయింపు కోసం దరఖాస్తు చేస్తుంది. నిర్మాణం కోసం పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (CPWD)తో ఒక ఎంఓయూ సంతకం చేస్తుంది.
జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, సంజయ్ గాంధీల స్మారకాలు ఉన్న రాజ్‌ఘాట్‌కి సమీపంలో స్మారక చిహ్నం ఉండే అవకాశం ఉంది. మన్మోహన్ సింగ్ మరణం తర్వాత అంత్యక్రియలు, స్మారక చిహ్నం నిర్మాణంపై కాంగ్రెస్, బీజేపీల మధ్య మాటల యుద్ధం నడిచింది. స్మారక చిహ్నం కేటాయించే చోటనే మాజీ ప్రధాని అంత్యక్రియాలు నిర్వహించాలని తాము చేసిన డిమాండ్‌ని బీజేపీ తిరస్కరించిందని కాంగ్రెస్ విమర్శించింది. అయితే, మన్మోహన్ సింగ్ మరణాన్ని కూడా కాంగ్రెస్ ‘‘రాజకీయం’’ చేస్తుందని బీజేపీ ప్రతిగా స్పందించింది.