కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది.. అయితే, ఇదే సమయంలో దేశవ్యాప్తంగా కరోనా పరీక్షల సంఖ్య తగ్గడంపై కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. వెంటనే టెస్టుల సంఖ్యను మరింత పెంచాల్సిన అవసరం ఉందని రాష్ట్రాలకు సూచించింది. మహమ్మారిని సమర్థంగా ట్రాక్ చేసేందుకు, తద్వారా సరైన జాగ్రత్త చర్యలు తీసుకునేందుకు.. కేసులను ముందస్తుగా గుర్తించడం ముఖ్యమని హెచ్చరించింది. కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు.. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖ రాశారు.
Read Also: ఇక వన్డే సమరం.. సిరీస్‌పై టీమిండియా గురి..!
ఐసీఎంఆర్ పోర్టల్ డేటా ప్రకారం అనేక రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పరీక్షలు తగ్గినట్లు కనిపిస్తోందని కేంద్రం తెలిపింది. ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత తరుణంలో… టెస్టుల పెంపుపై తక్షణమే దృష్టిసారించాలని సూచించింది. కేసుల వ్యాప్తి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ముమ్మరంగా పరీక్షలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. టెస్టింగ్‌తో కొత్త క్లస్టర్‌లు, హాట్‌స్పాట్‌లను గుర్తించవచ్చు. తద్వారా కంటైన్‌మెంట్ జోన్‌ల ఏర్పాటు, కాంటాక్ట్ ట్రేసింగ్, క్వారంటైనింగ్, ఐసొలేషన్ తదితర నియంత్రణ చర్యలు తీసుకునేందుకు సులభం అవుతుంది. వైరస్ ముప్పు తీవ్రంగా ఉన్నవారిని కాపాడే అవకాశం ఉంటుంది. లక్షణాలు ఉన్న వారిని, ఎట్ రిస్క్ కాంటాక్ట్‌లను తప్పనిసరిగా పరీక్షించాలని రాష్ట్రాలకు సూచనలు చేసింది కేంద్రం.. దీంతో.. దేశవ్యాప్తంగా కోవిడ్ నిర్ధారణ పరీక్షల సంఖ్య మరింత ఊపందుకోనుంది.. ఇప్పటికే భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు వెలుగు చూస్తుండగా.. టెస్ట్‌ల సంఖ్య పెరిగితే.. కేసులు మరింత భారీగా నమోదు అయ్యే అవకాశం ఉందంటున్నారు వైద్య నిపుణులు.