Centre Forms Panel To Examine Giving Dalit Status To Religious Converts: మతం మారిన వారికి దళిత హోదా ఇవ్వడాన్ని పరిశీలించేందుకు కేంద్ర ప్యానెల్ ఏర్పాటు చేసింది. చారిత్రాత్మకంగా షెడ్యూల్డ్ కులానికి చెందిన వారు మతమార్పిడి తర్వాత వారికి షెడ్యూల్ కుల హోదా ఇవ్వాలా.. వద్దా..? అని పరిశీలించేందుకు మాజీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కేజీ బాలకృష్ణన్ ఆధ్వర్యంలో కమిషన్ ఏర్పాటు చేసింది కేంద్రం. రాష్ట్రపతి ఉత్తర్వులు, రాజ్యాంగంలోని షెడ్యూల్ కులాల ఉత్తర్వులు, 1950 సవరణల ప్రకారం హిందూ, సిక్కు, బౌద్ధమతానికి కాకుండా ఇతర మతాల్లో ఉన్న వ్యక్తులను షెడ్యూల్ కులానికి సంబంధించిన వాడిగా పరిగణించలేదమని చెబుతోంది.
అయితే తమ మతంలో చేరిన దళితులకు షెడ్యూల్డ్ హోదా ఇవ్వాలని ముస్లిం, క్రైస్తవ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ వీరి డిమాండ్లను బీజేపీ వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలో మరోసారి మతం మారిన దళితులకు షెడ్యూల్డ్ హోదా ఇవ్వడమనే అంశం చర్చకు వచ్చింది. ప్రస్తుతం కేంద్రం నియమించిన ముగ్గురు సభ్యుల కమిషనల్ లో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ రవీందర్ కుమార్ జైన్, యూజీసీ సభ్యురాలు ప్రొఫెసర్ సుష్మా యాదవ్ ఉన్నారు. సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ గురువారం దీనిపై గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
Read Also: Man-eating Tiger: మనిషి మాంసానికి మరిగిన పులి.. చంపేయాలంటూ సర్కార్ ఆదేశాలు
రాజ్యాంగంలోని ఆర్టికల్ 341 ప్రకారం రాష్ట్రపతి ఉత్తర్వుల్లో పేర్కొన్న దాని ప్రకారం మతం మారిన వారికి షెడ్యూల్డ్ కులాల హోదా కల్పించే విషయాన్ని పరిశీలిస్తుంది. ఇతర మతాల్లోకి మారిన తర్వాత షెడ్యూల్డ్ కులాల ఆచారాాలు, సంప్రదాయాలు, సామాజిక వివక్షలో మార్పుల వంటి అంశాలను పరిగణలోకి తీసుకోని.. ఈ విషయం ఉన్న చిక్కులను కూడా ప్యానెల్ పరిశీలిస్తుంది.
కమిషన్ చీఫ్ గా ఉన్న కేజీ బాలకృష్ణన్ సుప్రీంకోర్టు మొదటి దళిత ప్రధాన న్యాయమూర్తి, జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్‌పర్సన్‌గా కూడా ఉన్నారు. కమిషన్ ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉండనుంది. చైర్‌పర్సన్‌గా బాధ్యతలు తీసుకున్న రెండేళ్ల లోపు నివేదికను సమర్పించాలని గెజిట్ నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.
గతంలో ఏర్పాటు చేసిన పలు కమిషన్లు మతం మారిన తర్వాత దళితులు పరిస్థితులపై అధ్యయనం చేశాయి. 2004లో ఏర్పాటు అయిన రంగనాథ్ మిశ్రా కమిషన్ మతానికి, షెడ్యూల్డ్ హోదాకు సంబంధం ఉండకూడదని సిఫారసు చేసింది. 2005లో ఏర్పాటు చేసిన జస్టిస్ రాజేందర్ సచార్ కమిషన్ మతం మారిన తర్వాత కూడా దళిత ముస్లింలు, దళిత క్రైస్తవుల్లో కూడా ఎలాంటి మార్పులు తీసుకురాలేదని వెల్లడించింది. 2008లో ఏర్పాటైన సతీష్ దేశ్ పాండే కమిటీ కూడా దళిత క్రైస్తవులకు, దళిత ముస్లింలకు ఎస్సీ హోదా విస్తరించాలని సిఫారసు చేసింది. జాతీయ మైనారిటీ కమిషన్ కూడా ఇలాంటి సిఫారసులే చేసింది.