కరోనా కల్లోలం సృష్టిస్తోన్న సమయంలో.. భారతీయులు పవిత్రంగా భావించే గంగా నదిలో కరోనా బాధితుల మృతదేహాలు కొట్టుకురావడం.. వందలాది మృతదేహాలు గంగా నదిలో తేలడం తీవ్ర కలకలమే సృష్టించింది.. ఈ నేపథ్యంలో.. ఉత్తరప్రదేశ్, బీహార్ ప్రభుత్వాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. గంగా నదిలో మృతదేహాలపై వస్తున్న కథనాలు ఆందోళనకరంగా ఉన్నాయని, ఇది అవాంఛనీయమని పేర్కొన్న కేంద్రం.. కరోనా మృతదేహాలకు గౌరవప్రదంగా అంత్యక్రియలు జరిగేవిధంగా చర్యలు తీసుకోవాలని కోరింది. ఆరోగ్య శాఖతో సంప్రదించి తరచూ గంగా నదిలోని నీటిని పరీక్షించాలని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండళ్ళను ఆదేశించింది కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ..
మరోవైపు.. గంగా నదిలో మృతదేహాలు తేలుతూ కనిపిస్తున్నాని ఫిర్యాదులు అందడంతో జాతీయ మానవ హక్కుల కమిషన్ మే 13న స్పందిస్తూ.. కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ, ఉత్తర ప్రదేశ్, బీహార్ ప్రభుత్వాలకు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.. దీంతో.. మృతదేహాలు గంగా నదిలో పడేయకుండా చర్యలకు పూనుకుంటున్నాయి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు.. ఇక, గంగా నదిలో కొట్టుకొస్తున్న మృతదేహాలకు అంత్యక్రియలు సవాల్‌గా మారిపోయింది.. కట్టెల కొరత కారణంగా.. గంగా పరివాహక ప్రాంతంలో మృతదేహాలను పూడ్చిపెట్టగా.. భారీ వర్షం కారణంగా కొన్ని మృతదేహాలు బయటకు వచ్చినట్టు చెబుతున్నారు. అంతేకాదు.. తాజాగా, మరో 50 మృతదేహాలు కూడా గంగా నదిలో తేలినట్టుగా చెబుతున్నారు.