దేశంలో లింగ నిష్పత్తిలో మహిళలు అగ్రస్థానంలో ఉన్నారు. గతంలో మగవారు ఎక్కువగా ఉండగా ఆడవారు తక్కువగా ఉండేవారు. అందుకే మగాళ్లకు పిల్ల దొరకడం లేదని మన పెద్దవాళ్లు కామెంట్ చేసేవాళ్లు. అయితే ఇప్పుడు దేశంలో మగవాళ్ల కంటే ఆడవాళ్లే ఎక్కువగా ఉన్నారని శనివారం నాడు లోక్సభలో కేంద్రమంత్రి భారతి ప్రవీణ్ పవార్ వెల్లడించారు. దేశంలో మహిళలు, పురుషుల నిష్పత్తి 1020: 1000గా ఉందని జాతీయ ఆరోగ్య సర్వేలో స్పష్టమైందని తెలిపారు. దేశంలో 1020 మంది మహిళలు ఉంటే… 1000 మంది పురుషులు ఉన్నారని పేర్కొన్నారు.
Read Also: హైదరాబాద్లో రికార్డు సృష్టించిన ‘చలి’
అయితే దేశంలో మహిళల సంఖ్య పెరగడాన్ని తమ ఘనతగా కేంద్ర మంత్రి భారతి ప్రవీణ్ పవార్ చెప్పుకున్నారు. బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బేటీ బచావో.. బేటీ పడావో పథకం వల్లే దేశంలో మహిళల సంఖ్య పెరిగిందని.. ఈ పథకం వల్ల మహిళల అభివృద్ధి జరుగుతోందని కేంద్రమంత్రి పేర్కొన్నారు. మరోవైపు మహిళల స్థితిగతుల్లో కూడా మార్పులు వచ్చాయి. సొంత భూమి, ఇల్లు ఉన్న మహిళల సంఖ్య 38.4 శాతం నుంచి 43 శాతానికి చేరినట్లు ఇటీవల కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నివేదికలో స్పష్టమైంది. ఈ విషయంలో పట్టణ ప్రాంతాల్లో మహిళలు 38.3 శాతంగా ఉండగా గ్రామీణ ప్రాంతాల మహిళలు 45.7 శాతంతో మెరుగైన స్థితిలో ఉన్నారు.