ఉక్రెయిన్ రష్యా మధ్య భీకరపోరు జరుగుతున్నది. ఎలాగైనా ఉక్రెయిన్ నుంచి బయటకు వచ్చేయాలని చాలా మంది ప్రజలు చూస్తున్నారు. ఉక్రెయిన్‌లో సుమారు 16 వేల మంది భారతీయులు ఉన్నారు. వీరిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య పరిస్థితులు మారుతున్న సమయంలో భారత ప్రభుత్వం ట్రావెల్ అడ్వైజరీని ప్రకటించింది. భారతీయులు వెంటనే వెనక్కి వచ్చేయ్యాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రత్యేక విమానాలను పంపింది. పరిస్థితులు దిగజారిపోతున్న సమయంలో సుమారు 4 వేల మంది భారతీయులు వెనక్కి వచ్చేశారు. వీలైనంత త్వరగా భారతీయులను వెనక్కి రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో రష్యా అనూహ్య నిర్ణయం తీసుకొని యుద్ధం ప్రకటించింది. దీంతో ఉక్రెయిన్ గగనతలాన్ని మూసేస్తూ నిర్ణయం తీసుకోవడంతో ఢిల్లీ నుంచి బయలుదేరి వెళ్లిన ఎయిర్ ఇండియా విమానం వెనక్కి వచ్చేసింది.
Read: Russia: కీలక నిర్ణయం… యూకే విమానాలపై నిషేధం…
కాగా, యుద్ధం మరింత ముదురుతున్న సమయంలో భారతీయులను సురక్షితంగా వెనక్కి తీసుకొచ్చేందుకు యుద్ధప్రాతిపథికన చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. రొమేనియా, హంగేరీ సరిహద్దుల నుంచి భారతీయులను తరలించాలని నిర్ణయించింది. భారతీయులను తరలించేందుకు కొన్ని బృందాలు రొమేనియా సరిహద్దు ప్రాంతమైన పొరుబ్నే-సీరెత్ వద్ద, హంగరీ సరిహద్దు ప్రాంతమైన చోప్ జొహోనీ వద్ద ఉన్నాయి. ఉక్రెయిన్ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న భారతీయులను ముందుగా అక్కడినుంచి తరలించేందుకు కేంద్రం కృషి చేస్తున్నది.