చైనాలో కరోనా 2019 చివర్లో ప్రారంభం అయినా… ఇండియాలో మాత్రం 2020 ఫిబ్రవరి- మార్చి నెలల్లో కరోనా కేసులు నమోదు అయ్యాయి. అయితే 2021 సెకండ్ వేవ్ లో పెద్ద ఎత్తున ప్రజలు కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. అయితే 2020 ఏడాదిలో వైద్యపరంగా ధ్రువీకరించిన మరణాలను బట్టి చూస్తే కరోనా కన్నా ఇతర అనారోగ్య సమస్యలతోనే ప్రజలు ఎక్కువగా మరణించారని తెలుస్తోంది.
2020లో వైద్యపరంగా ధ్రువీకరించిన మరణాల సంఖ్య దేశంలో 81.15 లక్షలు ఉంటే ఇందులో 42 శాతానికి పైగా గుండె జబ్బులు, న్యూమోనియా, ఆస్తమా వల్ల కలిగిన మరణాలే ఉన్నాయి. వైద్యపరంగా ధ్రువీకరించిన మరణాల రికార్డు 2020 ప్రకారం… ఆ ఏడాదిలో కోవిడ్ -19 వల్ల కేవలం 9 శాతం మరణాలే అంటే 1,60,618 మరణాలే నమోదు అయ్యాయి. రక్త ప్రసరణకు సంబంధించిన వ్యాధుల వల్ల 32.1 శాతం మంది ప్రాణాలు కోల్పోగా… శ్వాసకోశ వ్యవస్థ సంబంధి వ్యాధులు వల్ల 10 శాతం మంది చనిపోయారు. న్యూమోనియా, ఆస్తమాలు శ్వాసకోశ వ్యాధుల్లో భాగంగానే ఉన్నాయి.
అంటు వ్యాధులు, పరాన్న జీవి వ్యాధులు ప్రధానంగా సెఫ్టిసిమియా, క్షయ వ్యాధి వల్ల దేశంలో 7.1 శాతం మంది ప్రాణాలు కోల్పోయారు. ఎండోక్రైన్, పోషక, జీవక్రియ వ్యాధుల వల్ల మొత్తం 5.8 శాతం మంది ప్రాణాలు కోల్పోయారు. గాాయాలు, విష ప్రయోగాల వల్ల 5.6 శాతం మరణాలు సంభవించాయి.