High Court: ఇటీవల కాలంలో విడాకులు, తప్పుడు కేసులను పేర్కొంటూ భర్తల్ని హింసించే భార్యల కేసులు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో పాటు పరిస్థితులకు అనుగుణంగా లేని ‘‘భరణాన్ని’’ డిమాండ్ చేస్తున్నారు. వీటిపై ఇటీవల సుప్రీంకోర్టుతో పాటు పలు హైకోర్టులు కీలక వ్యాఖ్యలు చేశాయి. తాజాగా, ఢిల్లీ హైకోర్టు మహిళ దాఖలు చేసిన ‘‘భరణం’’ పిటిషన్‌పై కామెంట్స్ చేసింది.
సంపాదించే సామర్థ్యం ఉన్న, అర్హత కలిగిన మహిళలు తమ భర్తల నుంచి మధ్యంతర భరణాన్ని కోరకూడదని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. మార్చి 19న జస్టిస్ చంద్ర ధారి సింగ్ మాట్లాడుతూ.. సీఆర్‌పీసీ లోని సెక్షన్ 125(భార్యలు, పిల్లలు, తల్లిదండ్రుల పోషణ) జీవిత భాగస్వాముల మధ్య సమానత్వాన్ని కొనసాగించడానికి, భార్యలు, పిల్లలు, తల్లిదండ్రులకు రక్షణ కల్పించడానికి ఈ సెక్షన్ ఉద్దేశమని, “పని చేయకుండా ప్రోత్సహించేందుకు కాదు” అని అన్నారు. దీంతో విడిపోయిన భర్త నుంచి మధ్యంతర భరణాన్ని నిరాకరిస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా మహిళ దాఖలు చేసిన పిటిషన్‌ని హైకోర్టు కొట్టివేసింది.
Read Also: YouTube: ‘‘యూట్యూబ్’’ చూసి సొంతగా ఆపరేషన్ చేసుకున్న యువకుడు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
ఆస్ట్రేలియా నుంచి మాస్టర్స్ డిగ్రీ, దుబాయ్‌లో పనిచేసిన అనుభవం కలిగిన మహిళ భరణాన్ని డిమాండ్ చేయడాన్ని కోర్టు తప్పుపట్టింది. పిటిషనర్‌గా ఉన్న మహిళలకు ప్రపంచ వ్యవహారాలపై విస్తృత అవగాహన ఉందని, బలమైన విద్య నేపథ్యం ఉందని కోర్టు వ్యాఖ్యానించింది. జీవనోపాధి కోసం భాగస్వాములపై ఆధారపడే మహిళల మాదిరిగా కాకుండా, ఆమె స్వయంగా సంపాదించే అవకాశం ఉందని, భరణంపై ఆధారపడకుండా ఉద్యోగం వెతుక్కోవాలని కోర్టు ఆమెకు సూచించింది.
Read Also: SRH: చెప్పి మరీ అద్దాలు పగలగొడుతున్న అభిషేక్.. ప్రాక్టీస్ వీడియో వైరల్
ఈ కేసులో మహిళకు ఆమె తల్లి భరణంపై సలహా ఇచ్చిందనే ఆరోపణలు ఉన్నాయి. పిటిషనర్, ఆమె తల్లికి మధ్య జరిగిన వాట్సాప్ సంభాషణ పరిశీలనలోకి వచ్చింది. తల్లి తన కూతురికి ఉద్యోగం చేయడం వల్ల ఆమె భరణం క్లెయిమ్ దెబ్బతీస్తుందని సలహా ఇచ్చిందని ఆరోపణలు ఉన్నాయి. ఈ సంభాషణల చట్టబద్ధతను విచారణలో ధ్రువీకరించాల్సి ఉన్నప్పటికీ, కోర్టు ఈ కేసులో కావాలనే నిరుద్యోగాన్ని ప్రాథమిక సాక్ష్యంగా పరిగణించింది. భరణం కోసమే ఆమె నిరుద్యోగిగా ఉన్నట్లు గుర్తించింది.
ఈ కేసులో జంటకు డిసెంబర్ 2019లో వివాహం జరిగింది, ఆ తర్వాత సింగపూర్ వెళ్లిపోయారు. భర్త, అతడి కుటుంబ సభ్యులు తనపై క్రూరత్వానికి పాల్పడుతున్నారని, ఆ మహిళ 2021లో భారత్ తిరిగి వచ్చింది. భారత్ తిరిగిరావడానికి తన నగల్ని అమ్మేశానని, ఆర్థిక ఇబ్బందుల కారనంగా తన అంకుల్‌తో కలిసి ఉంటున్నానని చెప్పింది. జూన్ 2021లో భర్త నుంచి భరణం కావాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. భర్త బాగా సంపాదిస్తూ సంపన్న జీవనశైలిని గడుపుతుండగా, తాను నిరుద్యోగిగా, ఆదాయం లేకుండా ఉన్నానని చెప్పడాన్ని కోర్టు తప్పుపట్టింది. సంపాదించే అర్హత ఉండీ నిరుద్యోగిగా ఉండకూదడని మహిళకు కోర్టు సూచించింది. భరణానికి నిరాకరించింది.