మరో రెండ్రోజుల్లో ఐపీఎల్ మహా సంగ్రామం మొదలవబోతుంది. అందుకోసం అన్నీ జట్లు తమ హోంగ్రౌండ్‌లలో కఠినంగా ప్రాక్టీస్ చేస్తున్నాయి. అందులో భాగంగా.. సన్ రైజర్స్ హైదరాబాద్ స్టార్ బ్యాటర్, ఓపెనర్ అభిషేక్ శర్మ కూడా ప్రాక్టీస్‌లో పాల్గొన్నాడు. ఈ క్రమంలో.. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తున్న అభిషేక్ శర్మ.. తన అద్భుత షాట్లతో చెప్పి మరీ స్టేడియంలోని అద్దాలను పగలగొట్టాడు. గత సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) తరఫున ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్ తో కలిసి విధ్వంసమైన ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని అందించిన అభిషేక్.. ఈ సీజన్‌లోనూ అదే దూకుడును కొనసాగించాలని చూస్తున్నాడు.
Read Also: YouTube: ‘‘యూట్యూబ్’’ చూసి సొంతగా ఆపరేషన్ చేసుకున్న యువకుడు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
అభిషేక్ శర్మ ప్రాక్టీస్ వీడియో వైరల్
సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ ఇన్‌స్టాగ్రామ్ పేజీలో అభిషేక్ శర్మ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను షేర్ చేసింది. ఈ వీడియోలో “మీరు ఏమి విరిచారు?” అని అడగగా.. అభిషేక్ “కొన్ని బ్యాట్‌లు విరిచాను. ఇంకా బౌండరీ దగ్గర గాజు పగిలిన శబ్దం వినిపించింది” అంటూ సరదాగా సమాధానమిచ్చాడు. కాగా.. ఈ షాట్లు చూసి సన్ రైజర్స్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. మళ్లీ సిక్సర్ల మోత చూడాల్సిందేనని కామెంట్స్ చేస్తున్నారు.
Read Also: Hyderabad : మొదటి రోజు ఉద్యోగం చేసి వస్తుండగా ప్రమాదం.. యువ ఇంజనీర్ దుర్మరణం
గత సీజన్‌లో SRH తరఫున రెండవ అత్యధిక స్కోరర్‌గా అభిషేక్ శర్మ నిలిచాడు. 16 ఇన్నింగ్స్‌లలో 32.26 సగటుతో 484 పరుగులు చేశాడు. అందులో.. 204.21 స్ట్రైక్ రేట్‌తో ఆడాడు. కాగా.. ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన అభిషేక్.. జింబాబ్వే పర్యటనలో భారత జట్టుకు ఎంపిక అయ్యాడు. తన రెండో అంతర్జాతీయ మ్యాచ్‌లోనే 46 బంతుల్లో సెంచరీ సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇకపోతే.. సన్‌రైజర్స్ హైదరాబాద్ మార్చి 23న రాజస్థాన్ రాయల్స్ (RR) తో హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. గత సీజన్‌లో రన్నరప్‌గా నిలిచిన SRH, ఈసారి టైటిల్ గెలవాలని పట్టుదలతో ఉంది.