Congress: కర్ణాటక ఎన్నికల విజయంతో కాంగ్రెస్ పార్టీ పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంది. 2024 లోక్ సభ ఎన్నికలకు ముందు సెమీఫైనల్ గా భావించిన కర్ణాటకలో అధికారంలోకి వస్తుండటం కాంగ్రెస్ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. రాహుల్ గాంధీ ప్రధాని మంత్రి అభ్యర్థిత్వాన్ని ప్రకటించాాలని కాంగ్రెస్ నాయకులు, శ్రేణులు డిమాండ్ చేస్తున్నారు. గత కొన్నాళ్ల నుంచి విజయాల కోసం ఎదురుచూస్తున్న హస్తం పార్టీ ఘన విజయం సాధించడంతో రానున్న ఛత్తీస్ గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల ఎన్నికలకు ఆ పార్టీ సమాయత్తం అవుతోంది.
Read Also: Indore : 21 ఏళ్ల క్రితం చనిపోయిన మామ.. కట్నం కోసం వేధిస్తున్నాడని కాజల్ ఫిర్యాదు
ఇదిలా ఉంటే విపక్షాల కూటమి, పొత్తుల వ్యవహారం కూడా చర్చకు వస్తున్నాయి. దీనిపై రాహుల్ గాంధీ సన్నిహితుడు, పార్టీలో కీలక నేత అయిన కేసీ వేణుగోపాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేరళలో సీపీఎంతో, తెలంగాణలో బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోమని స్పష్టం చేశారు. అయితే ఎన్నికల తర్వాత పొత్తులు, కొన్ని సందర్భాల్లో ఎన్నికల ముందు పొత్తులు పెట్టుకునే అవకాశం ఉందని తెలిపారు. కొన్ని రాష్ట్రాల్లో సైద్ధాంతిక విభేదాలు ఉన్నా, ప్రత్యర్థులుగా ఉన్నప్పటికీ, ఇతర ప్రాంతీయ పార్టీలతో ఎన్నికల అనంతరం పొత్తులు పెట్టుకునేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందని ఆయన అన్నారు.
కర్ణాటకలో ముఖ్యమంత్రి ఎవరనేదానిపై పార్టీ కసరత్తు చేస్తుందని కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. డీకే శివకుమార్, సిద్ధరామయ్యలతో సంప్రదించి నిర్ణయం తీసుకుంటామని ఆయన అన్నారు. ఖర్గే ముఖ్యమంత్రి అవుతారనే వాదనల్ని కొట్టిపారేశారు. పుకార్లను నమ్మవద్దని కోరారు. రాజస్థాన్ లో నాయకత్వ సమస్య ఉందని పార్టీ దాన్ని పరిష్కరిస్తుందని అన్నారు. సచిన్ పైలట్, అశోక్ గెహ్లాట్ ల మధ్య సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. వచ్చే ఏడాది లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న క్రమంలో దేశవ్యాప్తంగా మరో ప్రచారానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. తూర్పు నుంచి పడమరకు ‘భారత్ జోడో యాత్ర’ను ప్రారంభిస్తామని తెలిపారు.