Canada: కెనడా మరోసారి భారత్‌పై నిందలు మోపింది. ఇప్పటికే ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఈ హత్యలో ఇప్పటికే ముగ్గురు భారతీయులను అరెస్ట్ చేసినట్లు కెనడా ప్రభుత్వం పేర్కొంది. ఇదిలా ఉంటే కెనడా రాజకీయాలను ప్రభావితం చేసేందుకు భారత్ ప్రయత్నిస్తోందని ఆ దేశం మరోసారి ఆరోపించింది. ముఖ్యంగా ఖలిస్తాన్ నిరసనల నేపథ్యంలో తమకు అనుకూలంగా ఉండే ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు భారత్ జోక్యం చేసుకుంటుందని చెప్పింది.
గత రెండు ఎన్నికల్లో ఇలాగే విదేశీ జోక్యానికి సంబంధించిన ఆధారాలు ఉన్నట్లుగా పేర్కొంది. భారత్ కెనడాలో తమకు అనుకూలంగా ఉండే అభ్యర్థుల్ని ఎన్నుకునేందుకు యత్నిస్తోందని నివేదిక ఆరోపించింది. అయితే, భారత్ ఈ ఆరోపణల్ని నిరాధారమైనవని తిరస్కరించింది. ఇంతే కాకుండా న్యూఢిల్లీ అంతర్గత విషయాల్లో ఒట్టవా జోక్యం చేసుకోవడమే ప్రధాన సమస్య అని చెప్పింది. భారత్‌తో పాటు చైనా కూడా కెనడా రాజకీయాల్లో జోక్యం చేసుకుంటుందని శుక్రవారం ప్రచురించిన నివేదిక పేర్కొంది.
Read Also: Shubman Gill : టీమిండియా మహిళ క్రికెటర్ కు బ్యాటింగ్ చిట్కాలు చెబుతున్న గిల్.. వైరల్ వీడియో..
కెనడాకు చెందిన ప్రాక్సీలతో సహా భారత్ అధికారులు కెనడియన్ కమ్యూనిటీలను, రాజకీయ నాయకులును ప్రభావితం చేసే అనేక రకాల కార్యకలాపాల్లో నిమగ్నమై ఉన్నారని, ఈ కార్యకలాపాల్లో విదేశీ జోక్యం ఉందని, ఇది కెనడాలో భారత అనుకూల ప్రయోజనాలను లక్ష్యంగా పెట్టుకుందని, ప్రత్యేకించి కెనడా బెస్డ్ ఖలిస్తాన్ మద్దతుదారుల గురించి భారత ప్రభుత్వం ఎలా గ్రహిస్తుంది అని నివేదిక భారత్ గురించి ప్రస్తావించింది. కెనడాలోని కొంతమంది భారత్ వ్యతిరేకతకు పాల్పడుతున్నారని భారత్ భావిస్తోందని, ఇది భారతదేశ స్థిరత్వం, జాతీయ భద్రతకు ముప్పుగా చూస్తోందని నివేదిక చెప్పింది. ఖలిస్తాన్ వేర్పాటువాదంతో జతకట్టే వారిని దేశానికి “విద్రోహ ముప్పు”గా భారతదేశం చూస్తుందని నివేదిక ధ్వజమెత్తింది.
2019, 2021 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి విదేశీ జోక్యం కోసం భారత్ దిశానిర్దేశం చేసిందని, భారత ప్రాక్సీ ఏజెంట్లు ప్రజాస్వామ్య ప్రక్రియల్లో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించి ఉండొచ్చని, వివిధ కెనడియన్ రాజకీయ నాయకులకు రహస్యంగా ఆర్థిక సహాయాన్ని అందించి ఉండిచ్చని పేర్కొంది. 194 పేజీల నివేదికలో భారత్‌ని 43 సార్లు ప్రస్తావించారు. భారత్‌తో పాటు కెనడాలో రష్యా, పాకిస్తాన్, ఇరాన్ వంటి దేశాలు జోక్యం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని గతంలో కెనడా పేర్కొంది. అయితే, భారత్ వీటిని తిరస్కరించింది. నిజానికి కెనడా వేర్పాటువాదులు, ఉగ్రవాదులకు, భారత వ్యతిరేక శక్తులకు కేంద్రంగా మారిపోయిందని భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది.