Canada: కెనడాకు తత్వం బోధపడుతోంది. రెండేళ్ల క్రితం ఖలిస్తానీ టెర్రరిస్ట్ హత్యను భారత్‌కు ముడిపెడుతూ అప్పటి ప్రధాని జస్టిన్ ట్రూడో పిచ్చి కూతలు కూశాడు. అప్పటి నుంచి రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. మరోవైపు, కెనడాకు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అయిన అమెరికా షాక్‌ల మీద షాక్‌లు ఇస్తోంది. చైనాతో వ్యాపారం చేస్తే, 100 శాతం సుంకాలు విధిస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ ఇస్తున్నాడు. ఈ నేపథ్యంలో, అమెరికాను దాటి తన ఉత్పత్తుల్ని వైవిధ్యపరచడానికి కెనడా ఇప్పుడు భారత్ వైపు చూస్తోంది.
Read Also: T20 World Cup: రంగంలోకి పాకిస్తాన్ ప్రధాని.. టీ20 వరల్డ్ కప్ ఆడుతుందా లేదా..?
ఈ నేపథ్యంలోనే మార్చిలో కెనడా ప్రధాని మార్క్ కార్నీ భారత్ సందర్శించే అవకాశం ఉంది. ఇంధనం, ఖనిజాలు, అణు సహకారంతో పాటు సాంతకేతికపై అనేక ఒప్పందాలు ఉంటాయని కెనడాలో భారత హైకమిషనర్ దినేష్ పట్నాయక్ చెప్పారు. భారత్‌తో కీలకమైన యురేనియం ఒప్పందంతో పాటు చమురు, గ్యాస్, కీలక ఖనిజాలు, ఏఐ, క్వాంటం కంప్యూటింగ్‌తో పాటు విద్య, సాంస్కృతిక సహకారంలో పలు ఒప్పందాలపై రెండు దేశాలు సంతకాలు చేయనున్నాయి. సుమారు 2.8 బిలియన్ కెనడియన్ డాలర్ల విలువైన 10 ఏళ్ల యురేనియం సరఫరా ఒప్పందం ఈ ప్యాకేజీలో భాగమయ్యే అవకాశం ఉంది.
ఈ వారంలో కెనడా ఇంధన మంత్రి టిమ్ హెడ్గ్సన్ భారత పర్యటనకు వస్తున్నారు. అంతర్జాతీయ భద్రతా ప్రమాణాలను గౌరవిస్తే ప్రస్తుత కెనడా-భారత అణు ఒప్పందం ప్రకారం అణు సహకారం కూడా చర్చల్లో ఉంటుందని అన్నారు. ముడిచమురు, ఎల్ఎన్‌జీతో సహా కీలక మైనింగ్ రంగాల్లో ఇరు దేశాల సహకారం పెరగనుంది. భారతదేశం మరియు కెనడా మధ్య సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (CEPA) కోసం అధికారిక చర్చలు మార్చిలో ప్రారంభమవుతాయని పట్నాయక్ అన్నారు. దాదాపుగా రెండేళ్ల నుంచి నిలిచిపోయిన ఇరు దేశాల వాణిజ్య చర్చలు మళ్లీ ప్రారంభం కానున్నాయి.