Canada: కెనడా నుంచి ఇండియాకు వెళ్లే ప్రయాణికులకు భద్రతా స్క్రీనింగ్ పెంచుతూ అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సోమవారం సాయంత్రం విడుదల చేసిన ఒక ప్రకటనలో, కెనడా రవాణా మంత్రి అనితా ఆనంద్ మాట్లాడుతూ.. తన డిపార్ట్‌మెంట్ భారత్‌కి ప్రయాణించే వారి కోసం చాలా జాగ్రత్తతో తాత్కాలిక అదనపు భద్రతా స్క్రీనింగ్ చర్యల్ని అమలు చేసిందని చెప్పారు. ఎయిర్ కెనడా ద్వారా భారత్‌కి వచ్చే ప్రయాణికులకు ఈ వీకెంట్‌లో నోటిఫికేషన్ పంపింది. ‘‘ భారత్ ప్రయాణించే ప్రయాణికులందరూ అధిక భద్రతా ఆదేశాల కారణంగా, రాబోయే రోజుల్లో విమాన భద్రతా నిరీక్షణ సమయాలు ఉహించిన దాని కంటే ఎక్కువ అవుతాయి’’ అని ఓ మెసేజ్‌లో వెళ్లడించారు. విమాన ప్రయాణానికి 4 గంటల ముందే ఎయిర్ పోర్టు చేరుకోవాలని సూచించారు.
Read Also: Pakistan: పాకిస్తాన్‌కి నిద్రలేని రాత్రులు.. ట్రంప్ క్యాబినెట్‌తో భయం భయం..
ఈ ఏడాది అక్టోబర్‌లో ఖలిస్తాన్ వేర్పాటువాద సంస్థ, ఉగ్రసంస్థగా పేర్కొనబడిన ‘‘సిక్స్ ఫర్ జస్టిస్(ఎస్ఎఫ్‌జే) భారత్ వెళ్లే విమానాలను బెదిరిస్తూ హెచ్చరికలు జారీ చేసింది. నవంబర్ 19 వరకు ఎయిర్ ఇండియా విమానాల్లో దాడులకు పాల్పడుతామని హెచ్చరించింది. నవంబర్ 2023లో కూడా ఆ సంస్థ చీఫ్, ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ.. ‘‘ నవంబర్ 19 తర్వాత ఎయిర్ ఇండియాలో ప్రయాణించవద్దు, మీ ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుంది’’ అని హెచ్చరించాడు. ఈ ముప్పు గురించి భారత దౌత్యకార్యాలయం కెనడా ప్రభుత్వం ముందు తన ఆందోళని లేవనెత్తింది.