By-elections Results: దేశంలో నవంబర్ 3న జరిగిన ఉప ఎన్నికలకు నేడు ఓట్ల లెక్కింపు జరగనుంది. మొత్తం ఆరు రాష్ట్రాల్లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎవరు గెలుపు సాధిస్తారనేది నేడు తెలియనుంది. ఇందులో కొన్ని స్థానాలు బీజేపీకి చాలా కీలకంగా ఉన్నాయి. మహారాష్ట్రలోని అంధేరి ఈస్ట్, తెలంగాణలోని మునుగోడు, బీహార్ లోని మోకామా, గోపాల్ గంజ్, హర్యానాలోని ఆదంపూర్, ఒడిశాలోని ధామ్ నగర్, ఉత్తర్ ప్రదేశ్ లోని గోల గోకరనాథ్ నియోజకవర్గాలకు ఎన్నిలకు జరిగాయి.
ఇందులో మునుగోడు, అందేరీ ఈస్ట్ తో పాటు బీహార్ లోని మోకామా, గోపాల్ గంజ్ నియోజవర్గాలను ప్రతిష్టాత్మకంగా మారాయి. ముఖ్యంగా ఇటీవల కాలంలో మహారాష్ట్ర, బీహార్ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారాయి. మహారాష్ట్రలో ఎన్సీపీ, శివసేన, కాంగ్రెస్ ఉమ్మడి ప్రభుత్వాన్ని దించేసి ఏక్ నాథ్ షిండే ముఖ్యమంత్రిగా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. గతంలో అంధేరి ఈస్ట్ లో శివసేన ఎమ్మెల్యేగా ఉన్న రమేష్ లత్కే మరణించడంతో ఉపఎన్నికలు అనివార్యం అయ్యాయి. ఈ మరోవైపు ఉద్ధవ్ ఠాక్రే వర్గం కూడా ఈ సీటు గెలుపుపై తమ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని భావిస్తోంది.
Read Also: Gujarat Elections: గుజరాత్ పీఠం బీజేపీదే.. హిమాచల్‌లో కూడా కాషాయమే..
బీహార్ లోని రెండు స్థానాల్లో ఎన్నికలు బీజేపీకి కీలకంగా మారాయి. గతంలో బీజేపీతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన నితీష్ కుమార్ జేడీయూ పార్టీ.. కొన్ని నెలల క్రితం పొత్తును తెంచుకుని ఆర్జేడీ పార్టీతో చేతులు కలిపి నితీష్ కుమార్ సీఎంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత మొకామా, గోపాల్ గంజ్ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరుతున్నాయి. మొకామాలో సిట్టింగ్ ఆర్జేడీ ఎమ్మెల్యే అనంత్ సింగ్ పై అనర్హత వేటుతో, గోపాల్ గంజ్ సిట్టింగ్ బీజేపీ ఎమ్మెల్యే సుభాష్ సింగ్ మరణంతో ఎన్నికలు వస్తున్నాయి. బీహార్ లో బీజేపీ బలపడాలంటే, ఆర్జేడీ, జేడీయూలకు ఎదురునిలవాలంటే ఈ ఎన్నికల్లో గెలుపు బీజేపీకి చాలా కీలకం.
ఇక తెలంగాణలోని మునుగోడులో మొనగాడు ఎవరో నేడు తేలనుంది. బీజేపీ తెలంగాణలో బలపడుతున్నామనే అభిప్రాయాన్ని కలిగించాలంటే ఈ ఉప ఎన్నికల్లో గెలుపు చాలా ముఖ్యం. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి బీజేపీ పార్టీ నుంచి బరిలో ఉన్నారు. ఇక టీఆర్ఎస్ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి రెడ్డి బరిలో ఉన్నారు.