Bus Falls Off Bridge In Jharkhand: జార్ఖండ్ రాష్ట్రంలో రోడ్డు ప్రమాదం జరిగింది. హజారీబాగ్ జిల్లాలో శనివారం ఓ బస్సు వంతెనపై నుంచి నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించగా.. చాలా మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో మరికొంత మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
గిరిదిహ్ జిల్లా నుంచి రాజధాని రాంచీకి వెళ్తున్న బస్సు హజారీబాగ్ జిల్లా తతిజారియా పోలీస్ స్టేషన్ పరిధిలో సివాన్నే నదిపై వంతెన నుంచి నదిలో పడిపోయింది. వంతెన రెయిలింగ్ విరిగిపోయిన ప్రదేశంలో ప్రమాదం జరిగినట్లు ఎస్పీ మనోజ్ రతన్ చోతే తెలిపారు. ప్రయాణ సమయంలో మొత్తం బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారు. మరికొంత మంది బస్సులో చిక్కుకుని ఉండటంతో సహాయచర్యలను కొనసాగిస్తున్నారు అధికారులు.
Read Also: Cows Theft: అక్కడ ఆవుల్నీ వదల్లేదు కేటుగాళ్లు
ఇద్దరు ప్రయాణికులు ప్రమాద సమయంలోనే మరణించగా.. మరో నలుగురు హజారీ బాగ్ లోని సదర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మరికొంత మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు కావడంతో మరణాల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బాధితులను మెరుగైన చికిత్స కోసం రాంచీకి తరలిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. బస్సు నది మధ్యలో పడి ఉంటే మరింత నష్టం జరిగేదని అధికారులు వెల్లడించారు. గ్యాస్ కట్టర్ సాయంతో బస్సు బాడీని కట్ చేసి ప్రయాణికులను రక్షించారు అధికారులు.
ఈ వారం పలు రాష్ట్రాల్లో వరసగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. శుక్రవారం ఒడిశాలోని ఝార్సుగూడ ప్రాంతంలో జె ఎస్ డబ్ల్యూ కంపెనీ నుంచి విధులు ముగించుకుని వస్తున్న క్రమంలో ఉద్యోగులు ప్రయాణిస్తున్న బస్సును, బొగ్గుతో వస్తున్న లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించారు. గురువారం జమ్మూ కాశ్మీర్ లోని రాజౌరీ జిల్లాలో బస్సు అదుపుతప్పి లోయలో పడిపోవడంతో ఆరుగురు ప్రయాణికులు మరణించారు. బుధవారం కాశ్మీర్ లోని పూంఛ్ జిల్లాలో ఇలాగే ఓ మినీ బస్సు లోయలో పడిన ఘటనలో 11 మంది మరణించారు.