ఢిల్లీలో మరోసారి టెన్షన్ నెలకొంది. మరోసారి నార్త్, సౌత్ ఢిల్లీ మున్సిపాలిటీల అధికారులు ఆక్రమణలపై ఉక్కుపాదం మోపారు. బుల్డోజర్లతో ఆక్రమణలను తొలగిస్తున్నారు. నిన్న ఢిల్లీలోని షాహీన్ బాగ్ లో కూల్చివేతలు ఉద్రిక్తతలకు దారి తీసింది. పెద్ద ఎత్తున స్థానికులు, ప్రజాప్రతినిధులు యాంటీ ఎన్ క్రోచ్మెంట్ డ్రైవ్ కు వ్యతిరేఖంగా ఆందోళనలు చేశారు. షాహీన్ బాగ్ లో ఆక్రమణల కూల్చివేతపై సీపీఐ సుప్రీం కోర్ట్ లో పిల్ దాఖలు చేసింది. అయితే ఈ పిల్ పై సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆక్రమణ తొలగింపులపై జోక్యం చేసుకోలేదు.
రెండో రోజు కూడా నార్త్, సౌత్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు బుల్డోజర్లతో ఆక్రమణలను కూల్చి వేస్తున్నారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ ఆక్రమణలను తొలగిస్తున్నారు. షాహీన్ బాగ్, మంగోల్ పురి, న్యూ ఫ్రెండ్స్ కాలనీల్లో బుల్డోజర్ డ్రైవ్ చేపట్టారు అధికారులు. స్థానికుల నుంచి వ్యతిరేఖత వచ్చినా కూడా అధికారులు వెనక్కి తగ్గడం లేదు. ఢిల్లీ పోలీసుల, పారామిలటరీ బలగాల భద్రతలో ఆక్రమణలు కూల్చివేస్తున్నారు. నిన్న జరిగిన కూల్చివేతలను అడ్డుకున్న ఆప్ ఎమ్మెల్యే అమనుల్లా ఖాన్ ను అరెస్ట్ చేశారు. తాజాగా ఈరోజు ఆక్రమణలను అడ్డుకున్న ఆప్ ఎమ్మెల్యే ముఖేష్ అహ్లావత్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈనెల 13 వరకు అక్రమ నిర్మాణాలు కూల్చివేయాలని ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లు టార్గెట్ గా పెట్టుకున్నాయి.
ఇటీవల హనుమాన్ జయంతి వేడుకల్లో భాగంగా ఊరేగింపు జరుగుతున్న క్రమంలో జహంగీర్ పురిలో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఈ ఘర్షణల్లో పోలీసులతో పాటు స్థానికులు గాయపడ్డారు. ఈ ఘర్షణలకు కారణమైనవారిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఆందోళకారులు అక్రమ నిర్మాణాలపై ఉంటూ రాళ్ల దాడి జరిగిందని తేలడంతో… ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు జహంగీర్ పురి ఏరియాలో ఆక్రమణలను తొలగించేందుకు బుల్డోజర్ డ్రైవ్ చేపట్టింది. ఆ సమయంలో కొన్ని రాజకీయ పార్టీలు దీన్ని వ్యతిరేఖిస్తూ… సుప్రీం కోర్ట్ లో పిల్ దాఖలు చేశారు. జహంగీర్ పురి కూల్చివేతలపై సుప్రీం కోర్ట్ స్టే విధించింది. అంతకుముందు మధ్య ప్రదేశ్ ఖార్గోన్ నగరంలో రామనవమి వేడుకల ఊరేగింపు సమయంలో కూడా ఇలాగే మతకలహాలు జరిగాయి. దీంతో అక్కడి శివరాజ్ సింగ్ చౌహాన్ సర్కార్ నగరంలోని అక్రమ నిర్మాణాలను బుల్డోజర్లతో కూల్చివేశారు.