Shiv Sena: ఉద్ధవ్ ఠాక్రేకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే వర్గమే నిజమైన శివసేన అని స్పీకర్ నిర్ణయించారు. స్పీకర్ రాహుల్ నార్వేకర్ బుధవారం వెలువరించిన తీర్పు సీఎం ఏక్‌నాథ్ షిండేకు బిగ్ విన్‌గా చెప్పవచ్చు. మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు షిండేకే ఉన్నందున నిజమైన శివసేన ఆయనదే అని చెప్పారు. శివసేన నుంచి ఏక్‌నాథ్ షిండేను తొలగించే అధికారం ఉద్ధవ్ ఠాక్రేకు లేదని, ఆయన రూపొందించిన పార్టీ రాజ్యాంగం కాపీ ఎన్నికల సంఘం వద్ద లేదని స్పీకర్ తన తీర్పులో వెల్లడించారు.
Read Also: Shiv Sena: ఏక్‌నాథ్ షిండేదే అసలైన శివసేన.. ఉద్ధవ్ ఠాక్రేకి షాకిచ్చిన స్పీకర్..
గతేడాది జూన్ నుంచి పెండింగ్‌లో ఉన్న అనర్హత పిటిషన్లపై స్పీకర్ నార్వేకర్ తన తీర్పును చెప్పారు. గత 18 నెలల క్రితం శివసేన పార్టీలో చీలిక వచ్చింది. మెజారిటీ ఎమ్మెల్యేలు ఉద్ధవ్ ఠాక్రేని కాదని ఏక్‌నాథ్ షిండే వైపు ఉన్నారు. 40 మందికి పైగా ఎమ్మెల్యేలు ఠాక్రేపై తిరుగుబాటు చేశారు. కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేనలతో కూడిన మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) ప్రభుత్వాన్ని కుప్పకూల్చారు. ఈ పరిణామాల తర్వాత ఏక్‌నాథ్ షిండే సీఎంగా, బీజేపీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తాజాగా ఈ కూటమిలో ఎన్సీపీ(అజిత్ పవార్) వర్గం కూడా చేరింది. ప్రస్తుతం సీఎంగా ఏక్‌నాథ్ షిండే, డిప్యూటీలుగా బీజేపీ నుంచి దేవేంద్ర ఫడ్నవీస్, ఎన్సీపీ నుంచి అజిత్ పవార్ ఉన్నారు.
మే 2023న ఈ అనర్హత పిటిషన్లపై విచారించిన సుప్రీంకోర్టు, నిర్ణయం తీసుకునే అధికారం స్పీకర్‌కి ఉందని చెప్పింది. పిటిషన్లపై త్వరగా తీర్పు ఇవ్వాలని మహారాష్ట్ర స్పీకర్‌ని ఆదేశించింది. గతంలో ఎన్నికల సంఘం నిజమైన శివసేన షిండేదే అని ఆయనకే విల్లు-బాణం గుర్తును కేటాయించాయి.