Parliament: పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన కేసును ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. అత్యంత పకడ్భందీ సెక్యూరిటీ వ్యవస్థ ఉంటే పార్లమెంట్‌లోకి విజిటర్ పాసులపై వెళ్లిన ఇద్దరు నిందితులు హంగామా సృష్టించారు. పొగ డబ్బాలను పేల్చి హల్చల్ చేశారు. మరో ఇద్దరు నిందితులు పార్లమెంట్ వెలుపల కూడా ఇలాంటి చర్యలకే పాల్పడ్డారు. ఈ ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ కేసులో నలుగురితో పాటు మరొకరిని పోలీసులు అరెస్ట్ చేయగా.. ప్రధాన నిందితుడు లలిత్ ఝా ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. లలిత్‌ని ప్రస్తుతం పోలీసులు ట్రాక్ చేస్తున్నారు. పరారీలో ఉన్న అతను చివరిసారిగా ఢిల్లీకి 125 కిలోమీటర్ల దూరంలోని రాజస్థాన్, హర్యానా సరిహద్దుల్లోని నీమ్రానా అనే పట్టణంలో చివరిసారిగా లొకేషన్ ట్రేస్ అయింది.
2001, డిసెంబర్ 13 పార్లమెంట్ ఉగ్రదాడి జరిగి 22 ఏళ్లు గడుస్తున్న బుధవారం రోజునే నిందితులు ఈ ఘటనకు పాల్పడ్డారు. అయితే ఈ మొత్తం కుట్రలో లలిత్ ఘా మాస్టర్ మైండ్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దాడికి డేట్ ఫిక్స్ చేసింది, ప్లాన్ చేసింది ఇతనే అని తెలుస్తోంది. కోల్‌కతా నివాసి, వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు అయిన లలిత్, షహీద్ భగత్‌సింగ్ చేత ప్రభావితమయ్యాడు. దేశం దృష్టి తనవైపు ఆకర్షించేలా చేయాలని అనుకున్నాడు. ఇప్పటి వరకు తెలిసిన వివరాల ప్రకారం.. ఏ ఉగ్రవాద సంస్థతో ఇతని ఎలాంటి సంబంధాలు లేవని సంబంధిత వర్గాలు తెలిపాయి.
Read Also: Food Poisoning: పెళ్లి భోజనాల్లో ఫుడ్ పాయిజనింగ్.. 80 మందికి అస్వస్థత..
లలిత్ ఝా సహచరులు సాగర్ శర్మ, మనో రంజన్ పార్లమెంట్ లోపల, నీలందేవీ, అమోల్ షిండే పార్లమెంట్ వెలుపల భద్రత ఉల్లంఘనకు పాల్పడ్డారు. ఐదో నిందితుడు విక్కీ శర్మను నిన్న సాయంత్ర గురుగ్రామ్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తం ఆరుగురు నిందితులు పొగడబ్బాలతో పార్లమెంట్‌లోకి వెళ్లాలని అనుకున్నారు. అయితే మనోరంజన్, సాగర్ శర్మలకు మాత్రమే విజిటర్ పాసులు లభించాయి. బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహ కార్యాలయం వీరికి పాసులను ఇష్యూ చేసింది.
లలిత్ పార్లమెంట్ వెలుపల పొగ వెలువడిన ఘటనను తన మొబైల్ ఫోన్లలో చిత్రీకరించి, ఘటన స్థలం నుంచి పారిపోయే ముందు సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. మీడియా కవరేజీ కోసం అతను కోల్‌కతాలోని ఎన్జీఓ వ్యక్తితో ఈ విజువల్స్‌ని పంచుకున్నాడని తెలుస్తోంది. లలిత్ పారిపోయే ముందు నలుగురు వ్యక్తులకు సంబంధించిన ఫోన్లు కూడా తీసుకెళ్లాడు. ఆధారాలు ఉండకుండా చేశాడని పోలీసులు భావిస్తున్నారు. విప్లవ భావజాలం కలిగిన వీరంతా ఓ ఫేస్ బుక్ ఫ్యాన్ పేజీలో చేరారు. గతేడాది లలిత్, సాగర్ శర్మ, మనో రంజన్ మైసూరులో కలుసుకున్నారు. అక్కడే వారు పార్లమెంట్‌లోకి చొరబడాలనే ప్లాన్ చేశారు. దీని తర్వాత నీలం, అమోల్‌ని ఈ పథకంలో చేర్చుకున్నారు. దీనిపై నిందితులంతా పలుమార్లు సమావేశమయ్యారు. లలిత్ వీరందరికి నాయకత్వం వహించాడు. వర్షాకాల సమావేశాల సమయంలో పార్లమెంట్ అన్ని ప్రవేశ మార్గాల వద్ద రెక్కీ నిర్వహించి, షూలను చెక్ చేయడం లేదని తెలుసుకుని ప్లాన్ చేసినట్లు మనోరంజన్ వెల్లడించాడని పోలీసు వర్గాలు తెలిపాయి.