సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బీఆర్ గవాయ్ నియమితులయ్యారు. ప్రస్తుత చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా మే 13న పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో తదుపరి చీఫ్ జస్టిస్‌గా గవాయ్ పేరును కొలీజియం ప్రాతిపాదించింది. ఇక మే 14న భారత ప్రధాన న్యాయమూర్తిగా బీఆర్ గవాయ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
జస్టిస్ గవాయ్ నవంబర్‌లో పదవీ విరమణ చేయనున్నారు. దాదాపు ఆరు నెలల పాటు భారత ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించనున్నారు. 2007లో దేశంలోని అత్యున్నత న్యాయ పదవికి పదోన్నతి పొందిన జస్టిస్ కేజీ బాలకృష్ణన్ తర్వాత ప్రధాన న్యాయమూర్తి పదవిని చేపట్టిన రెండవ దళితుడిగా గవాయ్ రికార్డ్ సృష్టిస్తున్నారు.
బీఆర్.గవాయ్ పూర్తి పేరు భూషణ్ రామకృష్ణ గవాయ్. 1985లో న్యాయవాదిగా బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్‌లో ప్రాక్టీస్ చేశారు. అనంతరం ప్రభుత్వ ప్లీడర్‌గా మహారాష్ట్ర ప్రభుత్వానికి ప్రభుత్వ ప్రాసిక్యూటర్‌గా పని చేశారు. ఇక నవంబర్ 14, 2003న బాంబే హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. మే 24, 2019న సుప్రీంకోర్టుకు పదోన్నతి పొందారు. దాదాపు బాంబే హైకోర్టులో 16 సంవత్సరాలు పని చేశారు.
కేంద్ర న్యాయశాఖ సూచనల మేరకు గవాయ్ పేరును కొలీజియం సిఫార్సు చేసింది. మే 14, 2025 నుంచి నవంబర్ 24, 2025 వరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా గవాయ్ పని చేయనున్నారు.