Bomb threat to Bangalore airport.. Engineering student arrested: బెంగళూర్ కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని పేల్చేస్తానని బెదిరిస్తూ ట్వీట్ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రజల్లో ఆందోళన పెంచేలా ట్వీట్ చేసినందుకు బెంగళూర్ ఈశాన్య క్రైమ్ పోలీసులు గురువారం 20 ఏళ్ల ఇంజనీరింగ్ విద్యార్థిని గురువారం అరెస్ట్ చేశారు. నిందితుడు వైభవ్ గణేష్ ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. బెంగళూర్ లోని దక్షిణ ప్రాంతంలోని కుడ్లు గేట్ లో నివాసం ఉంటున్నాడని పోలీసులు వెల్లడించారు.
Read Also: Pakistan: ఇస్లామాబాద్‌లో ఆత్మాహుతి దాడి…
డిసెంబర్ 10న నిందితుడు తన ట్విట్టర్ ఖాతాల నుంచి బెదిరింపులకు పాల్పడ్డాడు. నేను బెంగళూర్ విమానాశ్రయంపై బాంబు వేస్తానని..దీంతో వారు నగరానికి దగ్గరగా దాన్ని మళ్లీ నిర్మించవచ్చని ట్వీట్ చేశారు. కొద్ది సేపటికి దీన్ని తొలగించారు. అయితే కొద్ది సమయంలోనే ఇది వైరల్ గా మారింది. దీంతో అప్రమత్తం అయిన పోలీసులు నిందితుడి ట్వీట్టర్ ఖాతా ఆధారంగా అదుపులోకి తీసుకున్నారు. ఐపీసీ 505(ప్రజాదుర్వినియోగానికి దారి తీసే ప్రకటన), 507( అజ్ఞాతంగా నేరపూరిత బెదిరింపుకు పాల్పడటం) చట్టాల కింద కేసు నమోదు చేశారు. ఈ బెదిరింపులపై డిసెంబర్ 12 కెంపేగౌడ విమానాశ్రయ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది.
ఫిర్యాదు మేరకు ఈశాన్య డివిజన్ పోలీసులు ప్రత్యేక టీములు ఏర్పాటు చేసి, సైబర్ క్రైమ్ పోలీసులతో కలిసి వైభవ్ ని పట్టుకున్నారు. ట్వీట్ చేసిన అతడి మొబైల్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే విచారణ సమయంలో.. నిందితుడు తన నివాసం నుంచి ఎయిర్ పోర్టుకు ప్రయాణించడం కష్టంగా ఉందని.. చాలా దూరంలో ఉందనే నిరాశతోనే ఇలా ట్వీట్ చేశానని ఒప్పుకున్నాడు. ప్రజలు ఇలాంటి బెదిరింపులకు దూరంగా ఉండాలని పోలీసులు కోరారు. బాంబు బెదిరింపు అనేది ఒక జోక్ కాదని..దయచేసి ఇలాంటివి చేయవద్దని సూచించారు. బెంగళూరు విమానాశ్రయం దేవనహళ్లిలో ఉంది, ఇది నగరం మధ్య నుండి సుమారు 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. విమానాశ్రయం నగర శివార్లలో ఉన్నందుకు చాలా మంది ప్రయాణికలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.