ముంబైలోని ఓషివారా కాల్పుల కేసులో బాలీవుడ్ నటుడు కమల్ ఖాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం సాయంత్రం విచారణకు పిలిచి.. అనంతరం అధికారికంగా అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. శనివారం న్యాయస్థానం ఎదుట హాజరుపరచనున్నారు.
అసలేం జరిగిందంటే..
ఈ వారం ప్రారంభంలో ముంబైలోని నలంద సొసైటీలో కాల్పులు చోటుచేసుకున్నాయి. దీంతో నివాసితులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటనాస్థలికి చేరుకుని రెండు బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. రెండు, నాలుగు అంతస్థులో బుల్లెట్లు రికవరీ చేసుకున్నారు.
ఇక ఈ కేసు విచారణలో భాగంగా శుక్రవారం సాయంత్రం కమల్ ఆర్ ఖాన్‌ను ఓషివారా పోలీసులు స్టేషన్‌కు తీసుకొచ్చారు. మొత్తానికి విచారణలో లైసెన్స్ పొందిన తుపాకీతో కాల్పులు జరిపినట్లుగా అంగీకరించాడు. ఆయుధాన్ని స్వాధీనం చేసుకుని పత్రాలను పరిశీలిస్తున్నారు. అయితే నలంద సొసైటీలో ఉన్న ఒక ఫ్లాట్ రచయిత-దర్శకుడిది కాగా.. ఇంకో ఫ్లాట్ మోడల్‌దిగా చెబుతున్నారు. అయితే ఎందుకు తుపాకీ ఉపయోగించాల్సి వచ్చింది.. ఎలాంటి ఘర్షణ చోటుచేసుకుందో మాత్రం తేల్చలేదు.
కస్టడీ కోరే ఛాన్స్..
ఇక సీసీటీవీ ఫుటేజ్‌లో ఎలాంటి ఆధారాలు పోలీసులకు లభించలేదు. ఫోరెన్సిక్ బృందం సహాయంతో కమల్ ఆర్ ఖాన్ బంగ్లా వైపు నుంచి బుల్లెట్లు పేలి ఉండవచ్చని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అయితే కాల్పులకు గల కారణాలు వెల్లడి కాకపోవడంతో ఈరోజు కోర్టులో హాజరు పరిచిన తర్వాత పోలీసులు కస్టడీ కోరే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: UP: ప్రియుడ్ని పెట్టెలో దాచిన కోడలు.. అత్త ఏం చేసిందంటే..!