Congress: తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై ఎంఐఎం పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ విరుచుకుపడుతోంది. రేవంత్ రెడ్డిని ఆర్ఎస్ఎస్ కీలుబొమ్మ అని ఇటీవల ఓవైసీ విమర్శించారు. ఈ విమర్శలపై కాంగ్రెస్ సీనియర్ నేత, బెంగాల్ కాంగ్రెస్ చీఫ్ అధిర్ రంజన్ చౌదరి స్పందించారు. బీజేపీ పోటీని సులభతరం చేయడానికి అసదుద్దీన్ ఓవైసీ కాంగ్రెస్ ఓట్లను చీల్చుతున్నాడని అందరికి తెలుసని ఆయన ఆరోపించారు. ఓట్లను కోయడంలో అసదుద్దీన్ ప్రసిద్ధి చెందారని, ఈ విషయం దేశం మొత్తానికి తెలుసని, బీజేపీ నుంచి లంచాలు, డబ్బులు తీసుకుంటున్నాడంటూ సంచలన విమర్శలు చేశారు.
బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో మంగళవారం మీడియాతో పాల్పడుతూ అధిర్ రంజన్ చౌదరి ఈ వ్యాఖ్యలు చేశారు. అవినీతిపై యుద్ధం చేస్తామని చెబుతున్న బీజేపీ ముందు తమ పరిస్థితిని చూసుకోవాలని, వారి పార్టీలో అవినీతి కంపును పసిగట్టాలని అన్నారు. తెలంగాణలో ఇప్పటికే మార్పు తుఫాను మొదలైందని, దీని నుంచి బయటపడేందుకు బీజేపీ తమ అత్యంత విశ్వసనీయ నేత అసదుద్దీన్ ఓవైసీని ఆశ్రయించిందని ఆరోపించారు.
Read Also: Bihar: “ఇలాంటివి కొత్త కాదు”.. పోలీస్ అధికారి హత్యపై మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా కులగణనకు మద్దతిస్తుండటంతో హిందూ ఓట్లను ఏకం చేసి హిందుత్వం పేరుతో ఎన్నికల్లో పోటీ చేయాలని కలలు కన్న ప్రధాని నరేంద్రమోడీకి అడ్డంకిగా మారిందని ఆయన అన్నారు. హిందూ సమాజంలో వివక్ష ఉందని రాహుల్ గాంధీ చెబుతున్నారని, ఓబీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీల స్థితిగతులు తెలుసుకునే ఉద్దేశం మోదీకి లేదని, ఆయన మతతత్వ రాజకీయాలు చేయాలని అనుకుంటున్నారని అన్నారు. కులగణన ఆధారంగా అన్ని ప్రభుత్వ పథకాలు ప్లాన్ చేయాలని తెలిపారు. పశ్చిమ బెంగాల్ లోని జాయ్‌నగర్ లో స్థానిక టీఎంసీ నాయకుడి హత్యపై మాట్లాడుతూ.. 24 గంటలు గడిచినా, హంతకుడు ఎవరో తెలియలేదని ఎద్దేవా చేశారు. రామ మందిరం బీజేపీకి ప్రస్తుతం ఎన్నికల అంశంగా మారిందని, సరిహద్దుల్లో కూడా రామ మందిరంగ గురించే మోడీ మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.