Priyanka Gandhi: బిహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షల్లో అవకతవకలు జరిగాయంటూ వేలాదిమంది అభ్యర్థులు ఆదివారం పట్నాలోని గాంధీ మైదాన్ వద్ద ఆందోళన చేపట్టారు. వారిని అడ్డుకోవడానికి పోలీసులు లాఠీఛార్జి చేయడాన్ని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ తీవ్రంగా ఖండించింది. డబుల్ ఇంజిన్ సర్కార్ పాలనలో యువతపై డబుల్ దౌర్జన్యాలు కొనసాగుతున్నాయని పేర్కొనింది. ఈ చలిలో విద్యార్థులపై జల ఫిరంగులు ఉపయోగించడం, లాఠీఛార్జ్ చేయడం దారుణమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. బిహార్‌లో మూడు రోజుల వ్యవధిలో ప్రభుత్వం రెండు సార్లు స్టూడెంట్స్ పై దాడులకు దిగిందని మండిపడ్డారు. పరీక్షల్లో అవినీతి, రిగ్గింగ్‌లు, పేపర్ లీక్‌లను అరికట్టడం తమ బాధ్యత అనే విషయం నితీష్ ప్రభుత్వం మరిచిపోయిందని విమర్శించారు. తమకు జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా అభ్యర్థులు పోరాడుతుంటే సహించలేక వారిని అణచివేయడానికి ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ యత్నిస్తుందని ప్రియాంక గాంధీ దుయ్యబట్టారు.
Read Also: Punjab Bandh: పంజాబ్‌లో ఉద్రిక్తతలకు దారి తీసిన రైతుల బంద్.. 163 ట్రైన్స్ రద్దు..!
ఇక, బిహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ మాట్లాడుతూ.. విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడం చాలా బాధాకరమన్నారు. ఈ ఘటనలో చాలా మంది గాయపడ్డారు.. సోషల్ మీడియాలోని వీడియోలను చూస్తుంటే వారెంత బాధను అనుభవించారో అర్థమవుతోందని ఆయన అన్నారు. మరోవైపు, ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ మాట్లాడుతూ.. ఈ సంఘటనను నిరంకుశ ప్రభుత్వ నియంతృత్వానికి ఉదాహరణగా పేర్కొన్నాడు. అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న యువతతో పోలీసులు దారుణంగా ప్రవర్తించడం ప్రభుత్వ నియంతృత్వాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. విద్యార్థిగా ఎన్నో ఉద్యమాలు చేసి.. ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన నీతీశ్ కుమార్ సర్కార్ నుంచి ఈలాంటివి ఊహించలేదన్నారు.