Punjab Bandh: ఈరోజు పంజాబ్ రైతులు చేపట్టిన బంద్ తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. దీంతో చాలా చోట్ల రహదారులను బంద్ చేసి రైతులు పెద్దఎత్తున ఆందోళన చేస్తున్నారు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు పోలీసులు నిరసనకారులను అడ్డుకుంటున్నారు. అయితే, రైతుల న్యాయమైన డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వం రియాక్ట్ కాకపోవడంతో సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చా ఈ బంద్‌కు పిలుపునిచ్చాయి. నేటి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ బంద్ కొనసాగుతుందని రైతు సంఘాల ప్రతినిధులు చెప్పుకొచ్చారు. ఇక, పటియాల-చండీగఢ్ జాతీయ రహదారిపై టోల్ ప్లాజాల దగ్గర రైతులు ధర్నాకు దిగడంతో ఆ రూట్ లో భారీగా వాహనాలు ఆగిపోయాయి. అమృత్‌సర్ గోల్డెన్ గేట్ దగ్గర రైతులు పెద్ద సంఖ్యలో ఆందోళనకు దిగారు. బటిండాలోని రాంపుర్‌లో ప్రవేశ పాయింట్ల వద్ద రైతులు నిరసన చేస్తున్నారు. దీంతో పట్టణంలోకి రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది.
Read Also: INDvsAUS Test: మెల్‌బోర్న్ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం.. 155 పరుగులకు భారత్ ఆలౌట్
అలాగే, బంద్ నేపథ్యంలో అత్యవసర సేవలకు ఎలాంటి ఆటంకం కలిగించమని రైతు సంఘాల నేతలు ఇప్పటికే ప్రకటించారు. ఎయిర్ పోర్టులకు వెళ్లే వారిని, జాబ్ ఇంటర్వ్యూలకు హాజరయ్యే వారికి, ఆస్పత్రులకు వెళ్లేవారిని తాము అడ్డుకోమని తేల్చి చెప్పారు. మరోవైపు, రైతు నాయకుడు జగ్దిత్ సింగ్ దలేవాల్ చేపట్టిన నిరహార దీక్ష ఈరోజుకి 35కు చేరింది. వైద్య పరీక్షలకు దలేవాల్ నిరాకరిస్తున్నారు. ఇక, రైతుల బంద్‌తో ట్రైన్ సర్వీసులపైనా పడింది. దీంతో పంజాబ్- ఢిల్లీ మధ్య 163 రైళ్లను క్యాన్సిల్ చేసినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. దీంతో పంజాబ్‌లోని రైల్వే స్టేషన్లలో సరైన సమాచారం లేక ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు.