వచ్చే ఏడాదిలోనే బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్‌లో బీహార్ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే అన్ని పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. అయితే జేడీయూ ఎన్డీఏ కూటమిలో భాగం ఉంది. నితీష్‌కుమార్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయితే ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి అభ్యర్థి లేకుండా ఎన్డీఏ ఎన్నికల్లో పోటీ చేయగలదా అని అడిగిన ప్రశ్నకు… ‘‘మేము కలిసి కూర్చుని నిర్ణయిస్తాం. మేము నిర్ణయం తీసుకున్న తర్వాత మీకు తెలియజేస్తాము’’ అని అమిత్ షా గూఢమైన సమాధానం ఇచ్చారు. అమిత్ షా వ్యాఖ్యలు రాజకీయ చర్చలకు దారి తీసింది.
2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నితీష్‌కుమార్ ఎన్డీఏకు నాయకత్వం వహిస్తారా? లేదా? అన్న చర్చ మొదలైంది. రాజకీయ ఊహాగానాలకు తెరలేపింది. అయితే తాజాగా హర్యానాలోని సూరజ్‌కుండ్‌లో జరిగిన రెండు రోజుల కమిటీ సమావేశంలో బీజేపీ కోర్ కమిటీ క్లారిటీ ఇచ్చింది. ఊహాగానాలకు తెరదించారు. బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏకు నితీష్ కుమార్ నాయకత్వం వహిస్తారని కమలనాథులు ధృవీకరించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ జైస్వాల్ మీడియాతో మాట్లాడుతూ.. నితీష్ కుమార్‌కు కూటమి మద్దతుగా ఉంటుందని తేల్చిచెప్పారు. నితీష్ కుమార్, ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో ఎన్నికల్లో కలిసి ముందుకు సాగాలని కోర్ కమిటీ ఏకగ్రీవంగా అంగీకరించిందని ఆయన చెప్పారు. ఇందులో ఎలాంటి సందేహాలు ఉండవని.. నితీష్ కుమారే ముఖ్యమంత్రి అభ్యర్థిని తేల్చి చెప్పారు.
ఇదే వైఖరిని ఇతర సీనియర్ నేతలు కూడా సమర్థించారు. నితీష్ కుమార్ తమ నాయకుడని, ఎలాంటి గందరగోళం లేదని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు. ఐదు కూటమి భాగస్వాములు దీనిపై ఏకాభిప్రాయంతో ఉన్నట్లు వెల్లడించారు. హిందుస్థానీ అవామ్ మోర్చా (HAM-S) కూడా నితీష్ కుమార్‌కు మద్దతు ఇచ్చింది. 2025 ఎన్నికల్లో నితీష్ కుమార్ నేతృత్వంలో ఎన్‌డీఏ పోటీ చేస్తుందని కేంద్ర మంత్రి, హెచ్‌ఏఎం-ఎస్ నేత జితన్‌రామ్ మాంఝీ పేర్కొన్నారు.