BJP: కాంగ్రెస్, దాని ఎకో సిస్టమ్ విదేశీ ఆక్రమణదారులను ప్రేమిస్తుందని, హిందూ వ్యతిరేక నిరంకుశులను కీర్తిస్తుందని బీజేపీ ఆరోపించింది. మాజీ ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ ‘‘గజనీ’’పై చేసిన వ్యాఖ్యలపై శుక్రవారం తీవ్రంగా విమర్శించింది. విదేశీ ఆక్రమణ, దోపిడీదారులపై అన్సారీకి ఉన్న ప్రేమ అతని ‘‘వికృత మనస్తత్వాన్ని’’ చూపిస్తుందని బీజేపీ అధికార ప్రతినిధి సుధాంషు త్రివేది అన్నారు.
చరిత్ర పుస్తకాల్లో విదేశీ ఆక్రమణదారులు, దోపిడీదారులుగా పేర్కొన్న గజినీ మహ్మద్ వాస్తవానికి ‘‘భారతీయ దోపిడీదారుడు‘‘అని అన్సారీ ఒక ఇంటర్వ్యూలో చెప్పడం వివాదాస్పదమైంది. గజినీ, లోడీ వంటి వారు బయట నుంచి రాలేదని, వారందరూ భారతీయులే అని ఒక ఇంటర్వ్యూలో అన్సారీ చెప్పారు.
Read Also: Raipur Central Jail: ఆ కేసులో అరెస్టైన ప్రియుడు.. జైలుకెళ్లి సర్ ప్రైజ్ చేసిన ప్రియురాలు..
ఈ వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ ప్రతినిధి షెహజాద్ పూనావాలా స్పందిస్తూ.. ‘‘సోమనాథ్ ఆలయాన్ని ధ్వంసం చేసి, అపవిత్రం చేసిన గజినీని కీర్తించడం, ఢిల్లీ అల్లర్ల నిందితులు షార్జీల్ ఇమామ్, ఉమర్ ఖలీద్‌లను యువకులు అని పిలవడం కాంగ్రెస్ ఎకో సిస్టమ్‌కు అలవాటే , వారు సోమనాథ్ ఆలయానికి వ్యతిరేకం, ఔరంగాజేబు లాంటి వారి నేరాలను కప్పిపుచ్చుతారు, హిందువులపై జరిగిన అఘాయిత్యాలను పట్టించుకోరు. వారికి భారత్, హిందువులు అంటే ద్వేషం’’ అని అన్నారు.
మరో బీజేపీ నేత ప్రదీప్ భండారీ కూడా కాంగ్రెస్, అన్సారీలపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీని ‘‘ఆధునిక ముస్లిం లీగ్’’ అని అభివర్ణించారు. భారత ఉపరాష్ట్రపతిగా చేసిన వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధకరమని బీజేపీ నేత సుధాంశు త్రివేది అన్నారు. మొగల్ చక్రవర్తులందరూ బాగ్దాద్ ఖలీఫా పేరుతో పాలించారని, ఎలాగైతే బ్రిటీష్ వారు రాజు లేదా రాణి పేరుతో పాటించారో మొఘలులు కూడా అలాగే పాలించారని అన్నారు.
