Bihar Election Results: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి సంచలన విజయాన్ని నమోదు చేయబోతున్నట్లు ఫలితాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఓట్ల కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి బీజేపీ, జేడీయూలు అంతకంతకు మెజారిటీని పెంచుకుంటూ పోతున్నాయి. 2020 ఎన్నికలతో పోలిస్తే బీజేపీ కూటమి అఖండ విజయానికి చేరువైనట్లు ఫలితాలు తెలియజేస్తున్నాయి. మొత్తం 243 సీట్లులో మ్యాజిక్ ఫిగర్ 122, ఇప్పటికే ఎన్డీయే కూటమి ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్‌ను దాటి 160కి పైగా స్థానాల్లో అధిక్యత కనబరుస్తోంది.
ఇదిలా ఉంటే, మరోసారి ఇండి కూటమి(మహాఘట్బంధన్)కు ఈసారి కూడా ప్రజలు షాక్ ఇచ్చారు. ఎన్డీయేకు తిరుగులేని మెజారిటీ కట్టబెట్టడం ఆర్జేడీ+కాంగ్రెస్ కూటమికి రుచించని అంశం. అయితే, ఇక్కడ ఆర్జేడీ 40కి పైగా స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. ఇక్కడ కాంగ్రెస్ మాత్రం తేలిపోయింది. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ‘‘ఓట్ అధికార్ యాత్ర’’ చేపట్టినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. నిజానికి ఆర్జేడీకి కాంగ్రెస్ ఒక గుదిబండగా తయారైనట్లు ఫలితాలు చూస్తే తెలుస్తోంది.
Read Also: Bomb Threat: అలర్ట్.. శంషాబాద్‌లో రెండు విమానాలకు ఒకేసారి బాంబు బెదిరింపులు..
ఎన్నికల పొత్తుల్లో భాగంగా ఆర్జేడీ 143 స్థానాల్లో, కాంగ్రెస్ 61 స్థానాల్లో, కమ్యూనిస్ట్ పార్టీలు, వికాశీల్ ఇన్సాన్ పార్టీ(వీఐపీ) మిగిలిన స్థానాల్లో పోటీ చేశాయి. అయితే, ఫలితాల్లో మాత్రం ఆర్జేడీ+కాంగ్రెస్+కమ్యూనిస్ట్‌ల కూటమి కేవలం 60 లోపు స్థానాలకే పరిమితమైంది. 2020 ఎన్నికలతో పోలిస్తే ఈ సారి దారుణంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. కనీసం మూడంకెల స్థానాలు కూడా కైవసం చేసుకోలేని పరిస్థితి నెలకొంది. తాజా రిజల్ట్స్‌లో ఆర్జేడీ 45, కాంగ్రెరస్ 13 స్థానాల్లో, లెఫ్ట్ ఆరు స్థానాల్లో మాత్రమే లీడింగ్‌లో ఉన్నాయి.
ఒక వైపు.. జేడీయూ, బీజేపీలు రెండూ కలిసి ప్రభంజనం సృష్టిస్తుంటే, మరోవైపు.. ఆర్జేడీ, కాంగ్రెస్‌లు చతికిల పడ్డాయి. కాంగ్రెస్ ఆర్జేడీకి సాయం కావడం పక్కన ఉంచితే, భారంగా మారినట్లు తెలుస్తోంది. రాహుల్ గాంధీ ‘‘ఓట్ చోరీ’’ ఆరోపణలు లెక్క చేయకుండా బీహార్ ఓటర్లు ఎన్డీయేకు ఓట్లు గుద్దారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ 19 సీట్లు గెలుచుకుంటే, ఈసారి 13 సీట్లకు పరిమితమైంది. దీనిని బట్టి చూస్తే ఏ విధంగా దిగజారిందో అర్థం అవుతోంది. మొత్తంగా చూస్తే, కాంగ్రెస్ ఇండీ కూటమి పరిస్థితిని దిగజార్చుతున్నట్లు నిరూపితమవుతుంది.
