Bomb Threat: ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా మరో బిగ్ అలర్ట్ వచ్చింది. ఒకేసారి రెండు విమానాలకు బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో ఎయిర్‌పోర్టు సిబ్బంది అప్రమత్తమైంది. అబుదాబి నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు వస్తున్న ఇండిగో విమానం, లండన్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వస్తున్న బ్రిటిష్ ఎయిర్ లైన్స్ విమానాలకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. బాంబు బెదిరింపు మెయిల్స్ రావడంతో ఇండిగో విమానాన్ని ముంబైకి దారి మళ్లించారు అధికారులు. లండన్ నుంచి వస్తున్న బ్రిటిష్ ఎయిర్ లైన్స్ విమానాన్ని సమయాని కన్నా ముందుగానే అత్యవసర ల్యాండింగ్ చేశారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో అత్యవసర లాండింగ్ అయినా బ్రిటిష్ ఎయిర్ లైన్స్ విమానంలో నుంచి ప్రయాణికులను త్వరగా దింపేశారు. విమానాన్ని శంషాబాద్ ఎయిర్ పోర్టులోని ఐసోలేషన్ సెంటర్ కి తరలించి బాంబ్స్ స్క్వాడ్, డాగ్స్ స్క్వాడ్‌లతో తనిఖీలు నిర్వహిస్తున్నాయి సిఐఎస్ఎఫ్ బలగాలు.. దేశ రాజధాని ఢిల్లీలో బాంబు పేలుడు అనంతరం శంషాబాద్ ఎయిర్ పోర్టులో తనిఖీలు ముమ్మరం చేశారు. తరచుగా బాంబు బెదిరింపు కాల్స్ రావడంతో మరింత తనిఖీలు చేపడుతున్నారు.
READ MORE: IND vs SA 1st Test: మూడో స్థానంలో ఊహించని బ్యాటర్.. తొలి టెస్టులో ఆడే భారత జట్టు ఇదే!
మొన్న(నవంబర్ 12)న సైతం శంషాబాద్ సహా ఆరు ఎయిర్‌పోర్టులకు బాంబు బెదిరింపులు వచ్చాయి. శంషాబాద్ ఎయిర్‌పోర్టును పేల్చేస్తామని మెయిల్ వచ్చింది.. ఇండిగో ఎయిర్లైన్స్ కార్యాలయానికి మెయిల్ వచ్చింది.. ఎయిర్పోర్టులో తనిఖీలు నిర్వహించారు. అంతే కాదు.. మరోవైపు.. ఢిల్లీ, ముంబై, చెన్నై, గోవా, తిరువనంతపురం ఎయిర్పోర్టుల్లో సైతం బాంబులు ఉన్నాయంటూ ఇండిగో, ఎయిర్ ఇండియా కార్యాలయాలకు మెయిల్స్ వచ్చాయి. దీంతో రంగంలోకి దిగిన భద్రతా దళాలు క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ఐపీ అడ్రస్ ఆధారంగా అధికారులు దర్యాప్తు చేశారు. బాంబు ఆనవాళ్లు కనిపించకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.