Bihar Agriculture Minister Sudhakar Singh resigns: బీజేపీని కాదని ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చిన నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ ఆర్జేడీతో కలిసి బీహార్ లో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. జేడీయూ నుంచి నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో పాటు ఆర్జేడీ నుంచి లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వీ యాదవ్ ఉపముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ కూడా మహాగటబంధన్ ప్రభుత్వంలో భాగంగా ఉంది. ఈ మూడు పార్టీలు మంత్రివర్గంలో భాగంగా ఉన్నాయి.
ఇదిలా ఉంటే సీఎం నితీష్ కుమార్ కు షాక్ ఇస్తూ వ్యవసాయ శాఖ మంత్రి సుధాకర్ సింగ్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. తాను తన నియోజకవర్గ ప్రజలు, పార్టీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కు మాత్రమే జవాబుదారీ అని సుధాకర్ సింగ్ తేల్చి చెప్పారు. ఆదివారం తన మంత్రిపదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాజీనామా తర్వాత ప్రభుత్వానికి నష్టం కలిగించకూడదనే ఉద్దేశ్యంతో ఎటువంటి విమర్శలు చేయడం లేదని సుధాకర్ సింగ్ తండ్రి ఆర్జేడీ రాష్ట్ర అధ్యక్షుడు జగదానంద్ సింగ్ అన్నారు.
Read Also: IND Vs SA: రెండో టీ20లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా.. జట్టులో మార్పులు చేయని భారత్
2006లో రద్దు చేసిన అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెటింగ్ కమిటీ చట్టాన్ని, మండి విధానాన్ని పునరుద్ధరించే వరకు తాను విశ్రాంతి తీసుకోనని ఇటీవల సుధాకర్ సింగ్ అన్నారు. ఇటీవల జేడీయూ-ఆర్జేడీ మంత్రివర్గంలో ఆయన క్యాబినెట్ బెర్త్ దక్కించుకున్నారు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ పార్టీ నుంచి కైమూర్ జిల్లా రామ్ గఢ్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు సుధాకర్ సింగ్.
ఇటీవల తన డిపార్ట్మెంట్ లో ఎవరైనా లంచాలు అడిగితే చెప్పుతో కొట్టండి అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సుధాకర్ సింగ్ తన రాజీనామాను ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ కు పంపినట్లు సమాచారం. వ్యవసాయ మంత్రిగా ఉన్న తాను వ్యవసాయ సమస్యలపై ఎందుకు ప్రశ్నించకూడదంటూ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే వ్యాఖ్యలు చేశారు.