Petition in Kerala High Court on India Jodo Yatra: కాంగ్రెస్ పార్టీ గత వైభవం కోసం, పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకువచ్చేందుకు ఆ పార్టీ ‘ భారత్ జోడో యాత్ర’ను ప్రారంభించింది. కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తున్నారు. సెప్టెంబర్ 7న ప్రారంభం అయిన ఈ యాత్ర 14వ రోజుకు చేరింది. మొత్తం 12 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల గుండా 3570 కిలోమీటర్ల మేర రాహుల్ గాంధీ పాదయాత్ర జరగనుంది. కన్యాకుమారి నుంచి ప్రారంభం అయిన ఈ యాత్ర 5 నెలల తర్వాత కాశ్మీర్ లో ముగియనుంది. రాహుల్ యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది. అయితే అదే విధంగా వివాదాలు కూడా చుట్టుముడుతున్నాయి.
Read Also: Early Diwali to India: ఇండియాకి ఈ ఏడాది ముందే దీపావళి
తాజాగా రాహుల్ గాంధీ ‘ భారత్ జోడో యాత్ర’ను నియత్రించాటంటూ కేరళ హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. భారత్ జోడో యాత్ర కారణంగా రాష్ట్రంలో ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడుతున్నాయంటూ.. కోర్టుకెక్కాడు ఓ వ్యక్తి. ప్రస్తుతం కేరళలో భారత్ జోడో యాత్ర జరుగుతోంది. అయితే రాహుల్ గాంధీ పాదయాత్ర వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడుతున్నాయని న్యాయవాది కే. విజయన్ కేరళ హైకోర్టును ఆశ్రయించారు. రోడ్డుకు ఒకవైపు మాత్రమే యాత్ర జరిగేలా.. మరోవైపు వాహనాలు వెళ్లే విధంగా ఆదేశాలు ఇవ్వాలని కే. విజయన్ కోర్టును కోరారు.
భారత్ జోడో యాత్ర కారణంగా ఇటీవల జాతీయరహదారిని నాలుగు గంటల పాటు మూసేశారని.. దీంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని.. పిటిషన్ లో పేర్కొన్నాడు. అలాగే రాహుల్ గాంధీ యాత్ర కోసం పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారని.. దీనికి అయ్యే ఖర్చంతా కాంగ్రెస్ పార్టీనే భరించాలని.. ప్రజల సొమ్ము వినియోగంచకుండా చూడాలని కోరారు. కేరళ ప్రజా రహదారుల చట్టం 2011ను భారత్ జోడో యాత్ర ఉల్లంఘిస్తోందని ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ గురువారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే రాహుల్ గాంధీ యాత్రపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు అందింది. యాత్రలో పిల్లల్ని వినియోగిస్తున్నారని.. ఇది వారిపై ప్రభావం చూపిస్తుందని కేంద్ర బాలల హక్కుల సంఘం, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.