Agnipath Scheme Protest: అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కొన్ని సంస్థలు సోమవారం భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. అయితే దీనికి అనుమతిలేదని, పాల్గొంటే కఠిన చర్యలుంటాయని ప్రభుత్వాలు హెచ్చరించాయి. రైల్వే స్టేషన్ల వద్ద భద్రత పెంచారు. భారత్ బంద్ దృష్ట్యా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, గవర్నమెంట్ రైల్వే పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ మేరకు ఆర్పీఎఫ్ సీనియర్ అధికారులు ఒక ప్రకటన విడుదల చేసారు. అల్లర్లు, విధ్వంసానికి పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని అన్ని ఆర్పీఎఫ్ యూనిట్లకు ఆదేశాలు జారీ చేశారు. భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ)లోని కఠినమైన సెక్షన్ల కింద నిరసనకారులపై చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ముఖ్యంగా ప్రభుత్వం అమలు చేస్తున్న అగ్నిపథ్ పథకంపై యువతలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ పథకాన్ని విరమించుకోవాలని యువకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అగ్నిపథ్‌ను నిరసిస్తూ ఇటీవల బీహార్, యూపీ, తెలంగాణ, కేరళ, జార్ఖండ్, అస్సాం తదితర రాష్ట్రాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. నిరసనకారులు పలు రైళ్లకు నిప్పుపెట్టారు. ప్రాణ నష్టంతోపాటు ఆస్థి నష్టం కూడా జరిగింది. ఈ క్రమంలో అగ్నిపథ్ పథకాన్ని ఉపసంహరించుకునే ప్రసక్తే లేదని ఆర్మీ ఆదివారం విలేకరుల సమావేశంలో స్పష్టం చేసింది.
ఈ క్రమంలో అగ్నిపథ్ పథకాన్ని ఉపసంహరించుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు కొన్ని సంస్థలు భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో పోలీసులు, ఆర్పీఎఫ్, జీఆర్పీలు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మొబైల్ ఫోన్లు, వీడియో రికార్డింగ్ పరికరాలు, సీసీ కెమెరాల ద్వారా అక్రమార్కులకు వ్యతిరేకంగా డిజిటల్ సాక్ష్యాలను సేకరించాలని పోలీసులను ఆదేశించారు. ఏమైనా ఘటనలు జరిగితే వీడియో ఫుటేజీ ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టనున్నారు. ఎలాంటి హాని జరగకుండా ఉండేందుకు పోలీసు అధికారులు కూడా రక్షణ కవచాలను ధరించాలని కోరారు. అదే సమయంలో ఈరోజు బిహార్‌లోని కనీసం 20 జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలు విధించారు. ప్రజా ఆస్తులకు నష్టం కలిగించే లేదా హింసకు పాల్పడిన వారిని అరెస్టు చేయడానికి వెనకాడమని.. పోలీసు బలగాలను మోహరించామని కేరళ పోలీసులు ఆదివారం తెలిపారు.