S-500: ‘‘ఆపరేషన్ సిందూర్’’తో భారత్ అద్భుతం సృష్టించింది. స్వదేశీ టెక్నాలజీకి తోడుగా విదేశీ టెక్నాలజీ తోడైతే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయనేది మనం చూస్తున్నాం. పాకిస్తాన్ పంపిన డ్రోన్లను, క్షిపణులను మన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు నిర్వీర్యం చేశాయి. భారత్‌పై ఎన్ని సార్లు దాడికి ప్రయత్నించినా దాయాది దారుణంగా విఫలమైంది. ఆకాష్, ఎస్-400 సుదర్శన చక్ర, బ్రహ్మోస్ వంటి వ్యవస్థలు చాలా బాగా పనిచేశాయి.
ముఖ్యంగా, ఎస్-400 వ్యవస్థ పనితీరు ఇక్కడ హైలెట్‌గా నిలిచింది. పాక్ నుంచి వచ్చే డ్రోన్లు, క్షిపణుల్ని ఇంటర్‌సెప్ట్ చేసి, నింగిలోనే కూల్చేసింది. ఎస్-400 వ్యవస్థ పనితీరు ప్రపంచానికి తెలిసి వచ్చింది. ఇప్పుడు ఈ వ్యవస్థ కోసం పలు దేశాలు రష్యాని సంప్రదిస్తున్నాయి. ఇదిలా ఉంటే, ఇప్పుడు ఎస్-500 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ రెడీ అవుతోంది. అయితే, రష్యా ఎస్-500ని భారత్‌తో కలిసి సంయుక్తంగా తయారు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
రష్యా ప్రస్తుతం తన కొత్త S-500 వైమానిక రక్షణ వ్యవస్థపై పని చేస్తోంది. 2024లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రష్యా పర్యటన సందర్భంగా, భారతదేశంతో కలిసి S-500ను సంయుక్తంగా తయారు చేయాలని రష్యా మరోసారి ప్రతిపాదించింది. ఈ ఒప్పందం కుదిరితే, ప్రపంచంలోనే అత్యంత ఆధునిక వాయు రక్షణ సాంకేతికతను అభివృద్ధి చేసిన దేశాల జాబితాలో భారతదేశం చేరుతుంది. ఒక వేళ ఈ ఒప్పందం కుదిరితే ప్రపంచంలోనే అత్యుత్తమ ఎయిర్ డిఫెన్స్ మన సొంతమవుతుంది. పాక్, చైనాలు భారత్‌పై కన్నేసే ప్రసక్తే ఉండదు.
ఎస్-400 సుదర్శన చక్ర విజయం:
S-400 ట్రయంఫ్ అనేది రష్యా అభివృద్ధి చేసిన ఉపరితలం నుండి గగనతల రక్షణ వ్యవస్థ. దీనిని 2007 సంవత్సరంలో మొదటిసారిగా రష్యా సైన్యంలో చేర్చారు. ఈ వ్యవస్థ 400 కిలోమీటర్ల దూరం నుండి విమానం, డ్రోన్లు, క్రూయిజ్ క్షిపణులు, బాలిస్టిక్ క్షిపణులు వంటి వైమానిక ముప్పులను గుర్తించి కూల్చేయగలదు. భారతదేశం ఈ వ్యవస్థకు ‘సుదర్శన్ చక్ర’ అని పేరు పెట్టింది.
రష్యాతో భారత్ 5.43 బిలియన్ డాలర్లతో ఐదు ఎస్-400 రెజిమెంట్లను కొనుగోలు చేయడానికి 2018 అక్టోబర్లో ఒప్పందం కుదుర్చుకుంది. మూడు రెజిమెంట్లు భారత్‌కి డెలివరీ అయ్యాయి. 2026 నాటికి మరో రెండు వచ్చే అవకాశం ఉంది. ఉక్రెయిన్ రష్యా యుద్ధం కారణంగా కొంత ఆలస్యం జరిగింది.
ఎలా పనిచేస్తుంది..?
ఈ వ్యవస్థ చాలా వేగంగా, అత్యంత ఖచ్చితత్వంతో శత్రువుల వైమానిక లక్ష్యాలను గుర్తిస్తుంది. కేవలం 5 నిమిషాల్లోనే ట్రాక్ చేయగలదు. ఇది ఒకేసారి 300 వైమానిక లక్ష్యాలను ట్రాక్ చేయగలదు, వాటిలో 36 లక్ష్యాలను ఒకేసారి లక్ష్యంగా చేసుకుని దాడులు చేయగలదు. ఎస్-400 మొత్తం నాలుగు రకాల క్షిపణుల్ని ఉపయోగిస్తుంది. ఇందులో 400కి.మీ, 250 కి.మీ, 120 కి.మీ, 40 కి.మీ రేంజ్ క్షిపణులు ఉంటాయి. దూరం, ఎత్తు ఆధారంగా వీటిని ప్రయోగిస్తారు.
ఎక్కడ మోహరించారు..?
భారతదేశ వ్యూహాత్మక ప్రాంతాల్లో ఎస్-400 వ్యవస్థని మోహరించారు. సిలిగురి కారిడార్(చికెన్ నెక్) ప్రాంతంలో ఈశాన్య రాష్ట్రాలు, చైనా, బంగ్లాదేశ్‌కి సమీపంలో దీనిని మోహరించారు. పంజాబ్ సరిహద్దు ప్రాంతాల్లో మోహరించారు.